- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి, పరిమితికి మించి భారంతో నడుస్తున్న వాహనాలపై శనివారం అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ) చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో రవాణా శాఖ అధికారులు భారీగా కేసులు నమోదు చేయడంతో పాటు 100 వాహనాలను సీజ్ చేశారు. రోడ్డు భద్రతను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (డీటీసీ), ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు క్షేత్రస్థాయిలో పాల్గొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
రెండోసారి దొరికితే లైసెన్స్ రద్దు- జేటీసీ హెచ్చరిక
అధిక లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతినడమే కాకుండా వంతెనలు బలహీనపడి, ప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుందని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓవర్‌లోడ్‌కు కారణమైన క్వారీలు, మైనింగ్ రీచ్‌లు, పారిశ్రామిక సంస్థలు, వాహన యజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఒకే వాహనం రెండోసారి ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే పర్మిట్ రద్దు చేయడంతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని జేటీసీ స్పష్టం చేశారు.






