పామాయిల్ సాగుతో రైతుల తలరాత మారాలి: మంత్రి తుమ్మల

by Kodari Anjali |

తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పామాయిల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

పామాయిల్ సాగుతో రైతుల తలరాత మారాలి:  మంత్రి తుమ్మల
X

దిశ, దమ్మపేట: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని గుత్తావారిగూడెం గ్రామంలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తుమ్మలకు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అన్నదాతలు పూలు చల్లుతూ, సంప్రదాయ కొమ్ము నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్టేజీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు రైతులు ఘనంగా సన్మానం చేశారు. సభా ప్రాంగణంలో రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నిరంతరం ప్రజా సేవ, అభివృద్ధి ధ్యేయంగానే సాగుతోందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ దీవెనలతోనే సత్తుపల్లి ప్రజలు తనకు రాజకీయంగా తొలి అవకాశం కల్పించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించే సాంప్రదాయ పంటలకు సరైన మద్దతు ధర దక్కకపోవడం, అకాల వర్షాల దెబ్బకు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి రావడం కలచివేస్తోందన్నారు.

కనీసం పది లక్షల ఎకరాల్లో..

ఈ సమస్యలన్నింటికీ పామాయిల్ సాగు అద్భుతమైన పరిష్కారమని, ఇందులో చీడపీడల బెడద, కోతుల భయం, వర్షాల వల్ల నష్టపోయే ప్రమాదం ఏమాత్రం ఉండదని రైతులకు భరోసా ఇచ్చారు. దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో పచ్చగా కళకళలాడుతున్న పామాయిల్ తోటలను చూస్తుంటే మలేసియాను తలపిస్తూ కనువిందు చేస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పామాయిల్ సాగుతో కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కూడా పరుగులు పెడుతుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తెలంగాణలో కనీసం పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరించాలన్నదే తమ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఈ టార్గెట్‌ను చేరుకుంటామని స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విజయవంతంగా చేపట్టామని వివరించారు. అంతేకాకుండా, ఈ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజి, వక్క వంటి వాటిని సాగు చేయడం ద్వారా రైతులు అదనపు లాభాలు గడించవచ్చని సూచించారు.

ఆయన పట్ల తనకున్న భక్తిభావాన్ని..

రైతుల సౌకర్యార్థం అన్ని ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని, ఈ సీజన్‌లోనే సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరుగూడెం, అలాగే వైరా నియోజకవర్గాల్లో కొత్త ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సభను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సభావేదికపైనే ఆయన మంత్రి తుమ్మలకు 'ఫాదర్స్ డే' శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన పట్ల తనకున్న భక్తిభావాన్ని చాటుకున్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరడం వెనుక ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. ఒకప్పుడు తన తాత పొలంలో పనిచేస్తూ ఒక చిన్న సీసాలో సోడి జావ తీసుకెళ్లేవారని తన చిన్ననాటి కష్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రాంత రూపురేఖలు మార్చిన ఘనత..?

గండుగులపల్లి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది తుమ్మల నాగేశ్వరరావు అని కొనియాడిన ఆయన.. మంత్రి సహకారంతోనే గండుగులపల్లి నుంచి గోపాలపురం వరకు 17 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాలను (హార్టికల్చర్) తీసుకురావడం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్ల ఏర్పాటులో మంత్రి చొరవ ఎనలేనిదని ప్రశంసించారు. 1983లో మలేసియా నుంచి పామాయిల్ విత్తనాన్ని తీసుకువచ్చి ఈ ప్రాంత రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి తుమ్మలదేనని ఆయన కీర్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామెర మురళి మహిపాల్, కాసాని వెంకటేశ్వరరావు, ఆలపాటి రామచంద్ర ప్రసాద్, ఉమ్మడి రాష్ట్రాల తుమ్మల అభిమాన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, కె.వి సత్యనారాయణ, కొయ్యల అచ్యుతరావు సర్పంచ్ రుక్మిణి, కొల్లు బాలయ్య చౌదరి, సోయం మల్లికార్జునరావు, సుంకుపల్లి వీరభద్రం, పగడాల రమాదేవి, శ్రీరాముల ప్రసాద్,బుద్దే కోటేశ్వరరావు, గడ్డిపాటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Next Story