మహిళపై కక్షతోనే ముగ్గురి సజీవ దహనం.. వెలుగులోకి సంచలన నిజాలు

by Kodari Anjali |

మిర్యాలగూడ జరిగిన ఘోర ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

మహిళపై కక్షతోనే ముగ్గురి సజీవ దహనం.. వెలుగులోకి సంచలన నిజాలు
X

దిశ, నల్లగొండ క్రైం: మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమై మృతి చెందిన కేసును నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ముందుగా ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక పథకం ప్రకారం.. జరిగిన హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, డీసీఆర్‌బీ డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది.

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో..

నిందితుడు గతంలోనే వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు, మోసాలకు పాల్పడిన చరిత్ర కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది. తెలుగు మ్యాట్రిమోనీ వంటి వివాహ వెబ్‌సైట్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, వారి నమ్మకాన్ని సంపాదించి వివాహం చేసుకోవడం లేదా వివాహం చేసుకుంటానని నమ్మించి ఆర్థిక ప్రయోజనాలు పొందడం నిందితుడి అలవాటుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ధనలక్ష్మితో కూడా పరిచయం ఏర్పరుచుకుని వివాహం చేసుకున్నాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ధనలక్ష్మి అతడిని దూరం పెట్టింది. హాజీపూర్‌లో ఒక మహిళను మోసం చేసిన కేసులో జైలులో ఉన్న సమయంలో తనకు ఎలాంటి సహాయం చేయకపోవడం, బెయిల్ కోసం ప్రయత్నించకపోవడం పట్ల నిందితుడు తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ధనలక్ష్మి, ఆమె పిల్లలను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. తన ప్రణాళికలో భాగంగా నేరానికి కొన్ని రోజుల ముందే పరిస్థితులను పరిశీలించాడు.

అదే రోజు స్కూటీని దొంగిలించి..

సంఘటన జరిగిన రోజు ఉదయం తన ఇంటి సమీపంలో ఉన్న యాక్టివా స్కూటీని దొంగిలించి మిర్యాలగూడ వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో ఒక ప్లాస్టిక్ క్యాన్ కొనుగోలు చేసి పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపించుకున్నాడు. అనంతరం పలు ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి వరకు సమయం గడిపి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి సమయంలో బాధితుల ఇంటి పరిసరాలను గమనించి అందరూ నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లో పెట్రోల్ పోసి నిద్రిస్తున్న వారిపై చల్లాడు. అనంతరం అగ్గిపుల్ల గీసి మంటలు అంటించి సంఘటనను ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మంటలు నిందితుడికి కూడా అంటుకున్నప్పటికీ అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాధితురాలు ధనలక్ష్మి సంఘటన జరిగిన రోజు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తల్లి వనం చంద్రమ్మ (48), కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి (15) మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.

సూక్ష్మ ఆధారాల లభించడంతో..

సంఘటనా స్థలంలో లభించిన సూక్ష్మ ఆధారాలు, కాలిపోయిన ఇంటి వెనుక భాగంలో లభించిన పెట్రోల్ వాసన ఉన్న బకెట్, వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు, ప్రయాణ మార్గానికి సంబంధించిన సమాచారం, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి స్కూటీ, పెట్రోల్ క్యాన్, బకెట్, పాక్షికంగా కాలిపోయిన షర్ట్, హెల్మెట్, సెల్‌ఫోన్, ఘటనాస్థలంలో వదిలివెళ్లిన చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, వివాహ సంబంధాల కోసం ఉపయోగించే ఆన్‌లైన్ వేదికల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తిస్థాయి వివరాలు, నేపథ్యాన్ని నిర్ధారించుకున్న తర్వాతే సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన కేసును అత్యంత వేగంగా ఛేదించిన డీసీఆర్‌బీ డీఎస్పీ జి. రవి, మిర్యాలగూడ I టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణరావు, ప్రొబేషనరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్‌లు జి. రాజారాం, నల్లగంతుల శ్రీను, ఎస్. వెంకటేశ్వర్లు, హుస్సేన్, బి. వీరబాబు, జి. నర్సింహా, బి. ప్రసాద్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసాపత్రాలు మరియు నగదు రివార్డులను ప్రకటించారు.

Next Story