- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాన్‌పిక్ కేసులో ఈడీకి దెబ్బమీదదెబ్బ.. పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
వాన్‌పిక్ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఈడీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

దిశ, వెబ్‌డెస్క్: జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ (Vanpic) ఆస్తుల జప్తు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాన్‌పిక్ ఆస్తుల విడుదలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మసనం కొట్టివేసింది. అయితే, గతంలో వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. అయితే, దీనిపై విచారణ జరిపిన అప్పిలేట్ ట్రైబ్యునల్, ఈడీ జప్తు చేసిన వాన్‌పిక్ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలంటూ గతంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.
ట్రైబ్యునల్ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు..
కాగా, అప్పిలేట్ ట్రైబ్యునల్ (Appellate Tribunal) ఇచ్చిన ఆ ఆదేశాలను సవాలు చేస్తూ ఈడీ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులపై స్టే విధించాలని, ఆస్తుల విడుదలను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ధర్మసనం మరోసారి సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, గతంలో అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ దాఖలు చేసిన అభ్యర్థనలో ఎలాంటి బలం లేదని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తాజా తీర్పుతో వాన్‌పిక్ ఆస్తుల విడుదలకు ఉన్న మార్గం సుగమమైంది.
అయితే, వాన్‌పిక్ ఓడరేవుకు భూ కేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్‌ప్రోకో జరిగిందని గతంలో సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇందులో జోరుగా మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణ నేపథ్యంలో ఈడీ ఎంటరై స్వతంత్ర విచారణను మొదలు పెట్టింది. అనంతరం వాన్‌పిక్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. దీంతో సదరు సంస్థ అప్పిలేటు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం ఆ తీర్పును సవాలు చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా తాజాగా వారి పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.






