క్యాంపు రాజకీయాలు షురూ.. ఆ పార్టీకి వెన్నుపోటు భయం!?

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-13 02:26:02  IST  )

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో పాటు కార్పొరేషన్ పరిధిలో రాజకీయంగా ప్రభావం తగ్గిన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు అధికారం కోసం గంప కింద కప్పేసే ప్రమాదం ఉందనే భయంతో అందరి కంటే ముందుగానే క్యాంపు రాజకీయాలు షురూ చేసింది.

క్యాంపు రాజకీయాలు షురూ.. ఆ పార్టీకి వెన్నుపోటు భయం!?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో రెండు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలయ్యే వరకు నగర ప్రజల ఓట్లు రాబట్టుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ పోలింగ్ ముగిశాక, ఇక భారమంతా బ్యాలెట్ బాక్సుల్లో దాగిన ఓట్లపైనే వేశారు. ఓటరు మహాశయుల ఆశీర్వాదంతో అత్యధిక సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ఆశపడుతున్నాయి. మున్సిపల్ పోరులో సర్వశక్తులు ఒడ్డిన కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పార్టీల మధ్యే మేయర్ పీఠానికి పోటీ ఉండటంతో ఎవరికి వారే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు. మెజారిటీ సీట్లు గెలుచుకునేది తామేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండింటిలోనూ గెలుపు ధీమా ఏమాత్రం తగ్గకుండా కనిపిస్తుంది.

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో పాటు కార్పొరేషన్ పరిధిలో రాజకీయంగా ప్రభావం తగ్గిన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు అధికారం కోసం గంప కింద కప్పేసే ప్రమాదం ఉందనే భయంతో అందరి కంటే ముందుగానే క్యాంపు రాజకీయాలు షురూ చేసింది. శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ దాన్ని కాదని, నమ్మకమైన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా ఉంచి అభ్యర్థులు క్యాంపుకు బయలుదేరినట్లు నగరంలో చర్చించుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు క్యాంపుకు తరలించి అభ్యర్థులందరినీ హైదరాబాద్ లోని ఓ రిసార్టులో ఉంచి మేయర్ ఎన్నిక రోజు తిరిగి తీసుకొస్తారని తెలుస్తోంది.

క్యాంపుకు తరలనున్న కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు

బీజేపీ, కాంగ్రెస్ లు కూడా శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియ షురూ కాగానే గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాల నుంచి నేరుగా క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉంచారు. క్యాంపు కోసం ఎక్కడికి వెళ్లాలో, ఎలా వారిని మేనేజ్ చేయాలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. వారిని సూపర్ వైజ్ చేసేందుకు కూడా సమర్థవంతమైన కొందరు పార్టీకి చెందిన నమ్మకమైన నాయకులను ఎంగేజ్ చేసి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇండిపెండెంట్లకు గాలం?

గెలుపు అవకాశాలున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ,కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన కొందరు నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచి పోటీ పడ్డారు. వీరిలో కొందరు జనాదరణతో గెలిచే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆయా పార్టీల్లో ఉన్న తమ అనుచరుల ద్వారా బేరసారాలు కూడా మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టార్గెట్ మేయర్ పీఠం..

కాంగ్రెస్ , బీజేపీ లు టార్గెట్ మేయర్ పీఠం మిషన్ పేరుతో అడుగులు వేస్తోంది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మెజారిటీ రాకపోతే గెలిచిన ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతుతో పాటు, ఇండిపెండెంట్లు మద్దతు కూడా సాధించేందుకు వారికి భారీగా ముట్టజెప్పాలని ఫిక్స్ అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో వారి మద్దతును పొందేందుకు అందుబాటులో ఉన్న ఏ చాయిస్ ను వదులుకోకూడదని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇండిపెండెంట్ల పంట పండినట్లే..

ఈ సారి నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు దాదాపు నలుగురు గెలిచే అవకాశాలు ఉన్నాయి. వారిపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. మేయర్ ఎంపికలో ఇండిపెండెంట్ల అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీలకు వారి మద్దతు కావాల్సి వస్తే మాత్రం ఇండిపెండెంట్ల పంట పండినట్లేననే టాక్ వినిపిస్తోంది.


భవితవ్యం తేలేది నేడే.. కౌంటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే!

Next Story