భవితవ్యం తేలేది నేడే.. కౌంటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే!

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-13 01:48:25  IST  )

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. ఈ నెల 11న ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

భవితవ్యం తేలేది నేడే.. కౌంటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే!
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. ఈ నెల 11న ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు సంబంధించి ఇవాళ(శుక్రవారం) కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో కౌటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానున్నది. తక్కువ వార్డులున్న మున్సిపాలిటీల ఫలితాలు మధ్యాహ్నం వరకే వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి, జహీరాబాద్ వంటి మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డులున్నాయి. వార్డుల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో వెయ్యి ఓట్లకు టేబుల్

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 256 వార్డులుండగా 76 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపు కోసం ఆయా మున్సిపాలిటీల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11 మున్సిపాలిటీలకు గాను వెయ్యి ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. అత్యధికంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో 75 టేబుళ్లు, జహీరాబాద్ కు 74 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు సెంటర్ల ఫలితాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

*సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డులు, కౌంటింగ్ టేబుళ్ల సంఖ్య ఇలా..

మున్సిపాలిటీ వార్డులు టేబుళ్లు కౌంటింగ్ సెంటర్

ఇస్నాపూర్ 26 30 హై స్కూల్, ఇస్నాపూర్

గడ్డపోతారం 18 18 హైస్కూల్, చెట్లపోతారం

జిన్నారం 19 20 హై స్కూల్, జిన్నారం

కోహీర్ 16 16 జూ. కళాశాల, కోహీర్

అందోలుజోగిపేట 20 20 పాలిటెక్నిక్, జోగిపేట

గుమ్మడిదల 22 25 హై స్కూల్, గుమ్మడిదల

ఇంద్రేశం 18 18 డిగ్రీ కళాశాల, పెద్దకంజర్ల

నారాయణఖేడ్ 15 16 మోడల్ కళాశాల, జుక్కల్

సదాశివపేట 26 38 జూనియర్ కళాశాల

సంగారెడ్డి 38 75 తారా కళాశాల, సంగారెడ్డి

జహీరాబాద్ 37 74 బాలికల స్కూల్, రంజోల్

చేర్యాల 12 07 జూ.కళాశాల, చేర్యాల

దుబ్బాక 20 07 మోడల్ స్కూల్, లచ్చపేట

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 20 14 ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్

హుస్నాబాద్ 20 07 మోడల్ స్కూల్, హుస్నాబాద్

క్యాంపులకు కౌన్సిలర్ అభ్యర్థులు..

శుక్రవారం కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఓటమి గెలుపులపై సందిగ్థత నెలకొన్న క్రమంలో ఆయా పార్టీలు మున్సిపాలిటీలను దక్కించుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులతో క్యాంపులకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు రాగానే ఓటమి చెందిన వారిని క్యాంపు నుంచి పంపించి గెలిచి వారిని అక్కడే ఉంచుకుని వ్యూహాత్యంగా వ్యవహరించడానికి పార్టీల నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ లతో పాటు అన్ని మున్సిపాలిటీల నుంచి అభ్యర్థులు క్యాంపులకు వెళ్లినట్లు ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.

Next Story