Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ లకు కొత్త రూల్స్!.. భారీగా పెరగనున్న ప్రీమియం?

by Prasad Jukanti |   (  Updated:2025-02-21 13:14:01  IST  )

ఆరోగ్య బీమా విషయంలో కొత్త రూల్స్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ లకు కొత్త రూల్స్!.. భారీగా పెరగనున్న ప్రీమియం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరిగిపోతున్న ఆసుపత్రి ఖర్చులను భారాన్ని తగ్గించుకోవడంలో ఆరోగ్య బీమా (Health Insurance) ఉపయోగపడుతుంది. వీటి పట్ల ప్రజలు ఇప్పుడిప్పుటే అవగాహన తెచ్చుకుని హెల్త్ ఇన్సురెన్సుల వైపు ఆలోచనలు చేస్తున్నారు. ఇంతలో ఓ పిడుగులాంటి వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పాలసీల విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త నిబంధనలు (New Rules) తీసుకురాబోతున్నాయని, అదే జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం జోరుగా వినిపిస్తోంది. వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ ల జారీకి పాలసీదారు నివసించే ప్రాంతంలోని గాలి నాణ్యతకు లింక్ పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయని జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ విధానానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

అదనంగా 10 %-15 % ప్రీమియం భారం:

ప్రస్తుతం ఆరోగ్య బీమా జారీ చేసే విషయంలో పాలసీదారు వయసు, బరువు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని బీమా సంస్థలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. ధూమపానం, మద్యపానం చేసేవారికి, చేయని వారికి వేర్వేరుగా ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఇటీవల ఊపిరితిత్తుల వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మిగతా నగరాల్లోనూ వాయు కాలుష్యం డేంజర్ సైన్ ఇస్తోంది. దీంతో ఇకపై ఇన్సూరెన్స్ సంస్థలు సైతం ఈ విషయంలో మార్పులు తేవాలనే ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాలసీల జారీ విషయంలో వాయుకాలుష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇన్సూరెన్స్ సంస్థలు భావిస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే ఢిల్లీ వాసులు 10% నుండి 15% అధిక ప్రీమియం చెల్లించి రావొచ్చనే మిగతా నగరాల్లోనూ ప్రీమియంలో పెరుగుదల ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జీఎస్టీ భారం కారణంగా అనేక మంది హెల్త్ ఇన్సూరెన్సుల జోలికి వెళ్లడం లేదు. దీంతో ఆరోగ్య బీమాపై జీఎస్టీ వద్దని ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు పూర్తిగా జీఎస్టీ ఎత్తివేయాలని, మిగతా వారికి 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి అనేక మంది కోరుతున్నారు. అయినా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ క్రమంలో గాలిలో నాణ్యత అంశాన్ని ప్రీమియంకు (Insurance Premium) ముడిపెడితే సమాన్యులపై ఇది మరింత భారంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.

Read More : వాయు కాలుష్యానికి కూడా ఆరోగ్య బీమా

Next Story