Health Insurance: వాయు కాలుష్యానికి కూడా ఆరోగ్య బీమా

by S Gopi |   (  Updated:2025-02-21 13:12:09  IST  )

ఈ జాబితాలో వాయు కాలుష్యానికి సంబంధించి అంశాలు కూడా చేరనున్నాయి.

Health Insurance: వాయు కాలుష్యానికి కూడా ఆరోగ్య బీమా
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలంటే వ్యక్తి వయసు, ఆరోగ్య వివరాల గురించి బీమా సంస్థాలు ఆరా తీస్తాయి. వాటి ఆధారంగానే ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ధారిస్తాయి. తాజాగా ఈ జాబితాలో వాయు కాలుష్యానికి సంబంధించి అంశాలు కూడా చేరనున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి సంబంధించిన క్లెయిమ్‌లు అత్యధికంగా పెరిగిన నేపథ్యంలో బీమా కంపెనీలు ఈ మేరకు మార్పులను పరిశీలిస్తున్నాయి. దీనికి సంబంధించి బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతుల కోసం కూడా ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఒకవేళ ఐఆర్‌డీఏఐ దీనికి అనుమతిస్తే ఆరోగ్య బీమా ప్రీమియం 10-15 శాతం మేర పెరగనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉంది. గతేడాది న్యూఢిల్లీలో రికార్డు స్థాయి వాయు కాలుష్యం నమోదైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఐఆర్‌డీఏఐ నుంచి ఆమోదం పొందితే, దేశంలో ఆరోగ్య బీమా ప్రీమియంలను లెక్కించడంలో వాయు కాలుష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. అంతేకాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రీమియం ధరల పెంపునకు ఇది దోహదం కానుంది. 2024లో ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ), కార్డియోవస్కులర్‌ కండిషన్‌ల కోసం ఎక్కువ మంది ఢిల్లీ వాసులు చికిత్స తీసుకున్నారు. వాయు కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య గతేడాది ప్రథమార్థంలో 6 శాతం ఉండగా, ద్వితీయార్థం నాటికి 18 శాతానికి పెరిగింది. అందువల్లే బీమా సంస్థలు ప్రీమియం నిర్ధారణకు వాయు కాలుష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

Read More : హెల్త్ ఇన్సూరెన్స్ లకు కొత్త రూల్స్!.. భారీగా పెరగనున్న ప్రీమియం?

Next Story