‘నేను ఏసీ గదిలో కూర్చుని మాట్లాడటం లేదు’.. మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

by Jakkula.Mamatha |   (  Updated:2026-05-07 08:50:31  IST  )

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గురువారం సందర్శించారు.

‘నేను ఏసీ గదిలో కూర్చుని మాట్లాడటం లేదు’.. మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్
X

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గురువారం సందర్శించారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. "వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు" అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదన్నారు.

ఉత్తమ్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధం..

జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని హరీశ్ రావు ఆరోపించారు. "నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం లేదు. రైతుల మధ్య నిలబడి వారి బాధలు వింటున్నా" అని అన్నారు.

కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం..

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, మాయిశ్చర్ పరీక్షకు పది రోజులు, గన్నీ బ్యాగులకు మరో వారం, కాంటా పెట్టడానికి ఇంకో వారం పడుతోందని తెలిపారు. మిల్లులకు వెళ్లిన తర్వాత కూడా లారీకి 4 నుంచి 5 బస్తాల వరకు కటింగ్ పెడుతున్నారని ఆరోపించారు.

అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన..

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్న ఆయన, చౌటుప్పల్ మార్కెట్‌లో వర్షం పడితే వడ్ల కుప్పలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే మార్కెట్లకు లారీలు, గన్నీ బ్యాగులు పంపించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. యూరియా అమ్మకాలపై నిషేధం విధించడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం ఎక్కడ?

‘‘తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం ఇప్పుడు రైతుల బస్తాలకు 2-3 కిలోల కోత పడుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కొనుగోళ్లు నిర్వహించలేక అబద్ధాలు చెబుతుందని హరీశ్ రావు విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ.. రవాణా శాఖ కీలక ఆదేశాలు

Next Story