మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలరే.. అసలు సినిమా ఉంది: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-14 08:58:35  IST  )

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి కేవలం ఒక 'ట్రైలర్' మాత్రమేనని, అసలు 'సినిమా' ముందుందని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శిస్తూ, రానున్న రోజుల్లో తమ కూటమి రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలరే.. అసలు సినిమా ఉంది: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి (Ambati Joji Reddy), HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌ (Riyaz Ahmed)లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కూటమి అద్భుతమైన ప్రతిభ కనబరిచిందని కవిత పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని ప్రకటించిన తక్కువ సమయంలోనే ప్రజలు మమ్మల్ని ఆదరించారని గుర్తు చేశారు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల్లో 40 మంది విజయం సాధించారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాకు స్పష్టమైన మెజార్టీ లభించిందని ఆమె వెల్లడించారు. అధికారికంగా 33 స్థానాలు వచ్చినప్పటికీ, మరో 7 చోట్ల బీ ఫామ్ సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచింది కూడా తమ అభ్యర్థులేనని కవిత స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది..

గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ (BRS), ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితమైందని కవిత అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని కామెంట్ చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ (BJP) గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు పరోక్షంగా సహకరించారని, ఇది ఆ రెండు పార్టీల పొత్తుకు తొలిమెట్టు అని ఆరోపించారు. కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మీద చేసిన ఆరోపణలను ఇప్పుడు సీపీఐకి మద్దతు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ అంగీకరిస్తోందా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని, చాలా చోట్ల రీకౌంటింగ్ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కానీ త్వరలోనే జాగృతి ఆ లోటును భర్తీ చేస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ కరీంనగర్ మేయర్ తప్ప ఎక్కడా గెలవలేదని, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రూ.30 కోట్లు ఖర్చు చేసినా ఓడిపోయారని కవిత ఎద్దేవా చేశారు.

విలువలు లేని రాజకీయాలు.. అంబటి జోజిరెడ్డి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో బీజేపీ గెలవడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను బెదిరించి పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ తమ అభ్యర్థులు లొంగరని బోజిరెడ్డి స్పష్టం చేశారు. అనంతరం హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. రానున్న సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్, తెలంగాణ జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. కార్మికుల హక్కుల కోసం పనిచేసేది తామేనని, అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్.వి.ఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శులు ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల కోరిక - ఓటర్ల తీర్పు.. తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయాణంపై కవిత కీలక వ్యాఖ్యలు

Next Story