TG: సినిమా టికెట్ రేట్ల పెంపు ఇష్యూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’కు గుడ్‌న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-13 11:03:58  IST  )

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.

TG: సినిమా టికెట్ రేట్ల పెంపు ఇష్యూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’కు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే ధరల పెంపు నిర్ణయాన్ని బహిర్గతం చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ ఏ.ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే టికెట్ ధరల అనుమతుల ప్రక్రియ కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

అసాధ్యమైన గడువు..

"చాలా సినిమాలు 90 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుంటాయి. అటువంటప్పుడు విడుదలకు 90 రోజుల ముందే ధరల పెంపు నిర్ణయాన్ని ఎలా వెల్లడిస్తారు? ఇది అసాధ్యం" అని మైత్రీ మూవీ మేకర్స్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సినిమాల విడుదల నిలిచిపోయే ప్రమాదం ఉందని, ప్రభావితమయ్యే పక్షాల వాదనలు వినకుండానే హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు వివాదం ఏమిటి..?

అడ్వొకేట్ దాచేపల్లి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ జనవరి 20, 2026న ఒక ఆదేశం ఇచ్చింది. జనవరి 12న విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతి ఇవ్వడాన్ని చంద్రబాబు సవాలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. భవిష్యత్తులో టికెట్ ధరల పెంపు నిర్ణయాలను విడుదలకు 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. దీనివల్ల ప్రజలు లేదా ఇతర స్టేక్‌హోల్డర్లు ఆ నిర్ణయాన్ని రివ్యూ చేసే అవకాశం ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ 90 రోజుల నిబంధన ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇప్పుడు దానిపై స్టే విధించింది. అయితే.. ఈ స్టే వల్ల ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న విడుదలయ్యే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు భారీ ఊరట కలిగించనుంది.

టికెట్ ధరల పెంపు రూల్స్ చేంజ్.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Next Story