నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరు.. విచారణ వాయిదా

by Ramesh Naini |   (  Updated:2025-12-27 11:46:57  IST  )

కరోనా కాలంలో నమోదైన కేసుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా ఇతర నేతలు శనివారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరు.. విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కాలంలో నమోదైన కేసుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా ఇతర నేతలు శనివారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసు విచారణలో భాగంగా కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. విచారణ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. 2020లో కరోనా సమయంలో నిబంధనలను ఉల్లంఘించామనే ఆరోపణలతో అప్పటి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, సామాన్య ప్రజలపై చికిత్స భారం తగ్గించాలని డిమాండ్ చేసినందుకే తమపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడ్డందుకు తమను ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని అన్నారు.

కరోనా నిబంధనలను పూర్తిగా పాటిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశామని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని తమ న్యాయవాదులు కోర్టుకు స్పష్టంగా వివరించారని మంత్రి తెలిపారు. కరోనా చికిత్స సామాన్యులకు భారంగా మారిన పరిస్థితుల్లో ప్రజల సమస్యలను అప్పటి ప్రభుత్వానికి తెలియజేయడానికే నిరసన చేపట్టాల్సి వచ్చిందని కోర్టుకు వివరించినట్లు వెల్లడించారు. తమ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5 కి వాయిదా వేసిందని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీతక్కతో పాటు ఇతర నేతల తరఫున సీనియర్ న్యాయవాదులు నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్, కూర్మ నరేందర్, ఎస్.ఎస్. రావు కోర్టులో వాదనలు వినిపించారు.

Read More..

తెలంగాణ విద్యుత్ శాఖకు జాతీయ అవార్డు

Next Story