తెలంగాణ విద్యుత్ శాఖకు జాతీయ అవార్డు

by Gantepaka Srikanth |

తెలంగాణ విద్యుత్ శాఖకు జాతీయ అవార్డు

తెలంగాణ విద్యుత్ శాఖకు జాతీయ అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సేఫ్టీ అవార్డ్స్-2024 సంవత్సరానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌కు దక్కిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందించే సేవల పరంగా, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, ప్రమాదాలను తగ్గించడనికి తీసుకుంటున్న చర్యలకు భద్రతా ప్రమాణాల పెంపు, ఉద్యోగులకు అందించే శిక్షణలో గాను ఉత్తమ పనితీరును కనబరిచినదుకు ఈ అవార్డు వరించిందని తెలిపారు. ఈనెల 23న ముంబయిలో జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఈ (ఐటీ, ప్లానింగ్) ఎన్. శ్రవణ్ కుమార్, వరంగల్ డీఈ టెక్నికల్(సేఫ్టీ ఆఫీసర్) వై. రాంబాబు అందుకున్నారు. ఈ సందర్బంగా శనివారం ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డ్‌ను అందచేశారు.

ఈ సందర్భాంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య, భద్రతా విధానం కొరకు భద్రతా అంశాలపై SOP(ప్రామాణిక నిర్వహణ విధానం) ఇందులో భాగంగా రిస్క్ మేనేజ్‌మెంట్ పాలసీ, ఉద్యోగుల సంక్షేమ విధానం, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక విధానం, మెడికల్ పాలసీ అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే శిక్షణ కార్యక్రమాలు, భద్రతా అంశాలపై మాన్యువల్స్, పోస్టర్లు, కరపత్రాలు ద్వారా భద్రతా అంశాలపై సూచనలు తెలుపుతున్నామని, భద్రతా వారోత్సవాల నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు. సెక్షన్ స్థాయిలో, సబ్-డివిజన్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, సర్కిల్ స్థాయిలో విద్యుత్ ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉన్నతాధికారులు ప్రతి నెలా భద్రతా సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని అన్నారు.

5580 మంది ఉద్యోగులకు భద్రతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు787 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతిరోజూ భద్రతా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో పనులను ప్రారంభించే ముందు భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి 'పెప్ టాక్' నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ వినియోగదారులకు వారి పొలాల్లోనే స్విచ్ బోర్డులు, మోటార్ స్టార్టర్లను ఆపరేట్ చేసేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలపై అవగాహన కల్పించడానికి ఫీల్డ్ ఇంజినీర్ల ద్వారా 5,340 'పొలంబాట' సమావేశాలు నిర్వహించామన్నారు. లైన్ క్లియరెన్స్ (LC) ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కొత్తగా రూపొందించామని, LC మొబైల్ యాప్ ద్వారా లైన్ కియరెన్సు తీసుకోవడానికి సురక్షితమైన, భద్రమైన యాప్ అన్నారు. ప్రమాదాలను తగ్గించడానికి శిక్షణ, రక్షణ పరికరాల కోసం రూ.1.36 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. మెడికల్ పాలసీ ప్రకారం ఉద్యోగులకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌లు మరియు వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, సర్కిల్, కంపెనీ స్థాయిలలో వైద్య శిబిరాలు (Medical camps) నిర్వహిస్తున్నామని చెప్పారు. మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు వినియోగదారులకు అందిస్తున్నామని, ఈ అవార్డు రావడానికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి ఉందని అన్నారు.

Next Story