హాట్ టాపిక్‌గా KCR ఆస్తులు: CBI విచారణకు మంత్రి డిమాండ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-25 13:48:52  IST  )

తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

హాట్ టాపిక్‌గా KCR ఆస్తులు: CBI విచారణకు మంత్రి డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తి గొడవలు ముదిరాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత కొత్త పార్టీ వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించారు. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కలహాలు రోడ్డున పడ్డాయని వివేక్ విమర్శించారు. "కల్వకుంట్ల కుటుంబంలో తీవ్రమైన ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఆ వివాదాల కారణంగానే కవిత ఇంటి నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రకటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంపాదించిన ఆస్తుల పంపకాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య విభేదాలు తలెత్తాయి" అని ఆయన ఆరోపించారు.

అవినీతిపై కవితే సాక్ష్యం..

గత ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఇప్పుడు స్వయంగా కవితే తన మాటల ద్వారా పరోక్షంగా అంగీకరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. "బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని ఇప్పుడు కవిత ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ మరియు కుటుంబంపైనే ఆమె విమర్శలు చేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అందుకే కేసీఆర్ ఆస్తులపై కేంద్రం తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి" అని వివేక్ వెంకటస్వామి కోరారు. తెలంగాణ ప్రజల సంపదను పదేళ్ల పాటు దోచుకున్నారని, ఆ అక్రమ సంపాదన ఇప్పుడు వారి మధ్యే చిచ్చు పెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. కవిత బయటకు రావడం కేవలం అధికారం కోసం మాత్రమే కాదని, ఆస్తుల వాటాల్లో తేడాల వల్లేనని ఆయన పునరుద్ఘాటించారు.

తెలంగాణలో కవిత కొత్త పార్టీ.. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన కాంగ్రెస్ ఎంపీ.

Next Story