ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత కాసరవేణి రవి మృతి..

by Disha Web Desk 4 |
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత కాసరవేణి రవి మృతి..
X

దిశ, బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్ అబూజుమడ్ అడవుల్లో పోలీసు బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్‌లో కాసరవేణి రవి అలియాస్ అశోక్ మృతి చెందాడు. బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ 1991 ప్రాంతంలో విప్లబాట పట్టారు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. అక్క ఆల్య, సోదరులు వెంకటేష్, తిరుపతి ఉన్నారు. అందరిలో చిన్నవాడైన రవి టెన్త్ వరకు చదువుకుని పిన్న వయసులోనే విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. తొలుత అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్యలో చురుకుగా పని చేశాడు.

మిల్టెంట్‌గా పనిచేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ విప్లవోద్యమంలో పూర్తి కాలం కార్యకర్తగా చేరాడు. సింగరేణి బెల్ట్‌లో చాలా కాలం పని చేసిన రవి దండకారణ్యానికి బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలంగా దండకారణ్యంలోనే వివిధ హోదాలలో పనిచేశాడు. డీసీఎం స్థాయికి ఎదిగాడు. కాసరవేణి రవిపై ప్రభుత్వాలు భారీ రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ లిస్టులో జిల్లాలోని కోల్ బెల్టు కు చెందిన రవి ఒకరుగా ఉన్నారు. కాగా దండకారణ్యం లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న రవి ఎన్నో పోలీసు దాడులు, మిలిటరీ యాక్షన్‌లో ముందు నిలిచి దాడులు చేసి రెప్పపాటులో తప్పించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

విప్లవోద్యంలో కాసరవెణి రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు. అబూజ్‌మాడ్ కొండల్లో మృతి చెందిన మావోయిస్టు నేత కాసరవేణి రవి 30 ఏళ్ల విప్లవ ప్రస్థానం ఆయన మరణంతో ముగిసినట్లయింది. దీంతో విప్లవ కారులకు పెట్టిందిపేరైన బెల్లంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అబూజ్‌మడ్ కొండల్లో నేలకొరిగిన మావోయిస్టు నేత కాసరవేణి రవి మరణ వార్త జిల్లాలో కలకలం రేపింది. ఒక్కసారిగా ఈ విషాద సమాచారంతో రవి కుటుంబం దుఖ సాగరంలో మునిగిపోయింది. రవి బాల్యమిత్రులు, విప్లవ అభిమానులను ఎన్ కౌంటర్ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అయితే అబూజ్ మడ్ ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కాసరవేని రవి కుటుంబ సభ్యులు ఎవరు బెల్లంపల్లిలో ప్రస్తుతం లేరు. కాసరవేణి వెంకట్, తిరుపతి, ఆల్య తమ సొంత గ్రామమైన వంగరలోనే స్థిరపడ్డారు. దీంతో కాసరవేణి రవి అలియాస్ అశోక్ భౌతిక కాయం సొంత గ్రామమైన వంగరకు తరలించే అవకాశం ఉందని సమాచారం. సొంత గ్రామంలోనే మావోయిస్టు నేత కాసర వేణి రవి అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. అందుకు అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed