మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల కీలక సర్వే.. గంటలో 10 వేలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-03 03:01:49  IST  )

హైదరాబాద్ ఐటీ హబ్ లో ప్రతిరోజూ గంటలతరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికి కారణాలు తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక సర్వే నిర్వహించారు.

మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల కీలక సర్వే.. గంటలో 10 వేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ హబ్ ఏరియాలలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టే వ్యూహంలో భాగంగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.రమేశ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్‌లో మాన్యువల్ సర్వే చేపట్టారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వివరాలు వెల్లడించింది. గురువారం చేపట్టిన సర్వేలో కేవలం ఒక గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్ రైడర్లు (వాహనంలో ఒక్కరే ప్రయాణించేవారు) ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు కేవలం 3,584 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సింగిల్ రైడర్లు 6,554 అధికంగా ఉండటం వల్ల రహదారులపై వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగి తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లకు దారితీస్తోందని ఈ సర్వేలో స్పష్టమైంది. సర్వే నిర్వహించిన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు ప్రజల ముందకు తీసుకొచ్చారు.

వాహనదారులకు అవగాహన

ఐటీ ఉద్యోగులు, సాధారణ పౌరులు తమ ప్రయాణాల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ట్రాఫిక్ రహిత సైబరాబాద్‌ను నిర్మించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ-I హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ఎస్‌హెచ్ఓ శ్రీధర్ కుమార్, ఆర్.ఐ శ్రీకాంత్, ఎస్ఐలు టీవీ రావు, రాములు సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు.

పోలీసుల సూచనలు

3 సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్ పద్ధతిని పాటించండి.

3 సహోద్యోగులు లేదా స్నేహితులతో కలిసి కార్ పూలింగ్ చేయండి.

3 మెట్రో, బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచండి.

3 పీక్ అవర్స్‌లో అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి.

3 పాఠశాల, కళాశాల వాహనాలు నడిచే రద్దీ సమయాల్లో ప్రయాణించకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోండి.

ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ఎఫెక్ట్: ఆర్టీసీలో కొత్త నియామకాలకు ఇక బ్రేక్!

Next Story