ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ఎఫెక్ట్: ఆర్టీసీలో కొత్త నియామకాలకు ఇక బ్రేక్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-03 03:02:55  IST  )

తెలంగాణ ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ మొదలైంది.

ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ఎఫెక్ట్: ఆర్టీసీలో కొత్త నియామకాలకు ఇక బ్రేక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ స్టాఫ్‌ను జిల్లాలకు పంపించేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుండటంతో... అక్కడ డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్ల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు యాజమాన్యం గుర్తించింది. అదనంగా ఉన్న సిబ్బందిని ఇతర జోన్లు, విభాగాలకు మార్చేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు చెందిన డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు హైదరాబాద్, కరీంనగర్ జోన్లలోని రీజియన్లలో డిప్యూటేషన్‌పై పనిచేయడానికి తమ ఆప్షన్స్ ఇవ్వవచ్చని ప్రకటించింది. కనీసం పదో తరగతి అర్హత ఉన్న డ్రైవర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కండక్టర్లుగా మారేందుకు ఆప్షన్ ఇవ్వవచ్చు. మెకానిక్‌లను ఏడీసీలుగా, బస్ పాస్ కౌంటర్లలో లేదా హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే పార్కింగ్ డ్రైవర్లుగా ఓడీ ప్రాతిపదికన నియమించనున్నారు. ఇందుకో కోసం ఏప్రిల్ 15ను గడువుగా నిర్ణయించారు. డిప్యూటేషన్ లేదా రీ-కేటగిరీ... ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలే తమ సొంత డ్రైవర్లను, మెకానిక్‌లు, హెల్పర్లను కేటాయిస్తాయి. దీంతో ఆ బస్సుల నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు సంస్థలదే ఉంటుంది. ఈ బస్సుల్లో కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ నుంచి అవసరమవుతారు.

ఇక నియామకాలకు అవకాశమేది?

ఈ కొత్త విధానంతో ఆర్టీసీలో భవిష్యత్తులో డ్రైవర్లు, మెకానిక్‌ల రిక్రూట్‌మెంట్లు ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం పెరగడంతో ఆర్టీసీ తన సొంత సిబ్బందిని ఇతర విధులకు మళ్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న సిబ్బందికే ఇక్కడ పని లేనప్పుడు ఇక కొత్తగా నియామకాల అసరమెక్కడ ఉందని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి నరేందర్ పేర్కొన్నారు. క్రమంగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకే బడా ప్రైవేటు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి వారికి డిపోలు, విలువైన స్థలాలను అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం చేసుకున్న 3వేల ఆర్టీసీ పోస్టుల భర్తీ ఏమో కానీ కనీసం 300 పోస్టులను భర్తీ చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. ప్రభుత్వం ఒకసారి దీనిపై పునరాలోచన చేయకుంటే ఆర్టీసీ త్వరలోనే ఖతం అవుతుందని హెచ్చరించారు. ఓవైపున బస్ భవన్‌ను ఇతర శాఖలకు కేటాయిస్తున్న సర్కారు... మరోవైపున నగరానికి చెందిన ఆర్టీసీ సిబ్బందిని సైతం జిల్లాలకు డిప్యూటేషన్‌పై పంపించేందుకు రంగం సిద్ధం చేసింది.

మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల కీలక సర్వే.. గంటలో 10 వేలు

Next Story