లొసుగుల ‘లోటస్’: బఫర్ జోన్ ఆక్రమణలు.. శాటిలైట్ చిత్రాల్లో బాగోతం

by Malleboina Mahesh |

మదీనాగూడ పటేల్ చెరువు బఫర్ జోన్‌లో 'లోటస్ ఇన్‌ఫ్రా' చేపట్టిన నిర్మాణంలో భారీ అక్రమాలను శాటిలైట్ చిత్రాలు బయటపెట్టాయి.

లొసుగుల ‘లోటస్’: బఫర్ జోన్ ఆక్రమణలు.. శాటిలైట్ చిత్రాల్లో బాగోతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మదీనాగూడ పటేల్ చెరువు దిగువన ‘లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’ చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణంలో ఎటు చూసినా నిబంధనల ఉల్లంఘనలే ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చిందే నిషేధిత ఇరిగేషన్ బఫర్ జోన్‌లో కాగా, క్షేత్రస్థాయిలో కట్టిన భవనం కూడా జీహెచ్ఎంసీ అనుమతించిన అప్రూవల్ ప్లాన్‌కు ఏమాత్రం పొంతన లేకుండా అడ్డదిడ్డంగా సాగింది. నిబంధనలను తుంగలో తొక్కి లేపిన ఈ కట్టడానికి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన కఠిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అధికారులు విద్యుత్, నీటి కనెక్షన్లు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ప్లాన్ ఒకలా.. నిర్మాణం మరోలా..

లోటస్ ప్రాజెక్ట్ వ్యవహారంలో గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాలు గ్రౌండ్ రియాలిటీని స్పష్టంగా కండ్లకు కడుతున్నాయి. కాగితాల మీద జీహెచ్ఎంసీకి సమర్పించిన అప్రూవల్ ప్లాన్‌కు, వాస్తవంగా కట్టిన నిర్మాణానికి పొంతనే లేదు. చెరువు కట్ట వెంబడి వదలాల్సిన బఫర్ జోన్‌ను పూర్తిగా ఆక్రమించి భారీ బ్లాకులను నిర్మించారు. ప్లాన్‌లో ఓపెన్ స్పేస్, సెట్‌బ్యాక్‌లుగా చూపించిన ప్రదేశాల్లో సైతం నిర్మాణాలు అడ్డదిడ్డంగా విస్తరించాయి. సాక్షాత్తు శాటిలైట్ చిత్రాలు ఈ బాగోతాన్ని చూపిస్తున్నా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.

సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్..

అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టే దిశగా డిసెంబర్ 17, 2024 న సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్ ఆవాస్ ఏవం వికాస్ పరిషత్‌కు సంబంధించిన కేసులో సివిల్ అప్పీల్ నంబర్ 14604/2024 పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, దేశవ్యాప్తంగా అమలయ్యేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. భవన నిర్మాణ పూర్తి ధృవీకరణ పత్రం పొందిన తర్వాత మాత్రమే లబ్ధిదారులకు లేదా కొనుగోలుదారులకు ఫ్లాట్ల పొజిషన్ అప్పగిస్తామని బిల్డర్, దరఖాస్తుదారుడి నుంచి ముందుగానే అండర్‌టేకింగ్ తీసుకోవాలని, కంప్లీషన్/ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత మాత్రమే భవనాలకు విద్యుత్, తాగునీటి, మురుగునీటి కనెక్షన్లు వంటి అన్ని అవసరమైన సర్వీస్ కనెక్షన్లను సంబంధిత బోర్డులు మంజూరు చేయాలని స్పష్టంగా పేర్కొన్నది. భవనానికి సంబంధించిన ఓసీ, సీసీని పార్టీలు సమర్పించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ భవనంపై రుణాలను మంజూరు చేయాలని కూడా సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. ప్రాసిక్యూషన్‌తో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.

ఆగని అమ్మకాలు..

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, లోటస్ నిర్మాణంలో డీవియేషన్స్ ఉండటంతో వీరి ఓసీ దరఖాస్తు చాలా నెలలుగా మున్సిపల్ అధికారుల వద్దే పెండింగ్‌లో పడిపోయింది. అయినా సరే, బిల్డర్ యథేచ్ఛగా కొనుగోలుదారులకు ఫ్లాట్లను విక్రయిస్తూ.. రిజిస్ట్రేషన్లు, ఫ్లాట్ల అప్పగింతలు చేసేస్తుండటం గమనార్హం. ఒకవేళ లోటస్ ఇన్ ఫ్రా వారి ఉల్లంఘనల నేపథ్యంలో ఓసీ రాని పక్షంలో కొనుగోలుదారులు పరిస్థితి ఏమిటనేది ఇక్కడ ప్రశ్న గా నిలుస్తుంది.

సుప్రీం తీర్పు బేఖాతరు..

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. సుప్రీంకోర్టు ఓసీ లేకుండా కనెక్షన్లు ఇవ్వకూడదని గట్టిగా మొట్టికాయలు వేసినా, ఈ బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్లు ఎలా వచ్చాయన్నదే! దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మే 11, 2026 న జారీ చేసిన తమ తాజా మార్గదర్శకాల (మెమో నం. 23/26) లో సైతం.. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పిస్తేనే రెగ్యులర్ విద్యుత్ సరఫరా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. నిర్మాణ సమయంలో వాడుకునే తాత్కాలిక (కేటగిరి-8) కనెక్షన్‌కు మాత్రమే ఓసీ అవసరం లేదని వెసులుబాటు ఇచ్చారు.

లోటస్ ప్రాజెక్ట్ ఎత్తు సుమారు 18 మీటర్లు. ఇక్కడ అప్రూవల్‌కు, గ్రౌండ్ రియాలిటీకి పొంతన లేదు, ఓసీ రాలేదు అని స్పష్టంగా చెబుతున్నారు. అయినా కూడా ఫ్లాట్ లోకి జనం చేరిపోతున్నారు. నివాసాలకు కరెంటు, నీళ్లు అందుతున్నాయి. అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను, అలాగే విద్యుత్ సంస్థ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ను క్షేత్ర స్థాయిలో విద్యుత్, జలమండలి అధికారులు బుట్టదాఖలు చేశారా? లేక తాత్కాలిక కనెక్షన్ ముసుగులో రెగ్యులర్ కనెక్షన్ల వాడుకకు వంతపాడుతున్నారా? తప్పుడు పద్ధతుల్లో ఈ సదుపాయాలు కల్పించిన ఆ అధికారులపై, నిబంధనలు మీరిన బిల్డర్ పై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వ పెద్దలకు ఉందా..? అన్నది వేచి చూడాలి.

Next Story