మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

by Batti.Sumithra |

మామిడి పండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి
X

దిశ, హిమాయత్ నగర్ : మామిడి పండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం అక్క అయిన భువనేశ్వరి (17) మృతి చెందగా , మంగళవారం చెల్లెలు అయిన సంధ్య (10) చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతానికి వైజినాథ్, ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి విఠల్ వాడిలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల వారి బంధువైన రేణుక వీరి ఇంటికి వస్తున్న క్రమంలో నారాయణగూడలోని జలమండలి సమీపంలో కొనుగోలు చేసి ఇచ్చిన మామిడి పండ్లను తల్లి ఇందుమంతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం మామిడిపండ్లు తిన్న ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు చికిత్స నిమిత్తం వెళ్లారు. వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి(17) సోమవారం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మంగళవారం భువనేశ్వరి సోదరి సంధ్య కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story