తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్.. 44 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

by Malleboina Mahesh |

పొడి గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణలో నేడు 44°C ఉష్ణోగ్రతలతో హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్.. 44 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్: నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సామాన్య ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వెదర్ మ్యాన్ ఉహించని విధంగా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పుంజుకోనుంది. వాయువ్య భారతదేశం (North West India) నుండి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో గురువారం (జూన్ 11) రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెదర్ మ్యాన్ హీట్‌వేవ్ (Heatwave) హెచ్చరికలను జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 44°C కి చేరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతల అంచనా..

రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటనున్నాయి. అలాగే తూర్పు తెలంగాణలోని ప్రాంతంలోని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య తెలంగాణలో ఎండల తీవ్రత ఓ మోస్తరుగా ఉంటూ 38°C నుండి 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు కావచ్చని వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

రాత్రి వేళల్లో అక్కడక్కడ ఉరుములు - మెరుపులతో వర్షాలు..

ఒకవైపు పగటిపూట తీవ్రమైన ఎండలు, భారీ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికి.. సాయంత్రం, రాత్రి వేళల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాబోయే గంటల్లో రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను (Thunderstorms) వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కేవలం ఒకట్రెండు చోట్ల మాత్రమే విడివిడిగా (Isolated rains) తేలికపాటి జల్లులు పడవచ్చని వెదర్ మ్యాన్ నివేదిక స్పష్టం చేసింది.

Next Story