కాడెద్దుగా మారిన మహిళా రైతు.. గుండెల్ని పిండేసే హృదయవిదారక దృశ్యం!

by Prasad Jukanti |

పిడుగుపాటుకు తమ వద్ద ఉన్న ఎద్దు చనిపోవడంతో మరో ఎద్దును కొనే ఆర్థిక స్తోమత లేక కాడెద్దుగా మారిందో రైతు.

కాడెద్దుగా మారిన మహిళా రైతు.. గుండెల్ని పిండేసే హృదయవిదారక దృశ్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ పేద రైతు కుటుంబంపై ప్రకృతి ప్రకోపించింది. ఆ నిరుపేద కుటుంబానికి జీవనాధారమైన ఎద్దును పిడుగుపాటు రూపంలో బలితీసుకుంది. దీంతో మరో ఎద్దును కొనే ఆర్థిక స్థోమత లేక సాగును వదిలేసుకోలే ఆ కుటుంబంలోని మహిళ రైతు కాడెద్దుగా మారింది. భుజంపై నాగలి మోస్తూ భర్తతో కలిసి పొలం పనుల్లో ముందుకు సాగుతోంది. కన్నీరు పెట్టిస్తున ఈ దృశ్యం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామంలో జరిగింది. కాశీనాథ్ గైక్వాడ్, హౌసబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం పిడుగుపాటుకు వీరి వద్ద ఉన్న ఎద్దుల్లో ఒకటి చనిపోయింది. దీంతో మరో ఎద్దును కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో హౌసబాయి తాను ఎద్దుగా మారాల్సి వచ్చింది. తన భర్త అరకను దున్నుతుంటే నాగలికి తమ వద్ద ఉన్న ఎద్దును ఒకవైపు కట్టి మరో వైపు హౌసబాయి ఉండి పొలం దున్నుతోంది.

ఎమ్మెల్యే వీడియో పోస్టుతో వైరల్:

ఈ హృదయవిదారకమైన ఘటనకు సంబంధించిన వీడియోను ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడే కుటుంబం జంతువు స్థానాన్ని భర్తీ చేయాల్సి రావడం పట్ల పవార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుకు సహాయం అందించాలని ఆయన కోరారు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందేలా చూడాలన్నారు. అలాగే ఈ రైతు కుటుంబానికి రుణమాఫీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం కాశీనాథ్ కుటుంబానికి గురువారం మరో ఎద్దును కొనుగోలు చేసి అందజేసింది.




Next Story