క్యూనెట్ కొత్త అవతారం 'ఇగ్నైట్'.. రూ.5 వేల కోట్ల మోసానికి HYD పోలీసుల అడ్డుకట్ట

by Prasad Jukanti |

క్యూనెట్ సరికొత్త రూపం 'ఇగ్నైట్' పేరిట సాగించాలనుకున్న రూ. 5000 కోట్ల అంతర్జాతీయ గొలుసుకట్టు మోసాన్ని భగ్నం చేసిన హైదరాబాద్ పోలీసులు.

క్యూనెట్ కొత్త అవతారం ఇగ్నైట్.. రూ.5 వేల కోట్ల మోసానికి  HYD పోలీసుల అడ్డుకట్ట
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీసులు అంతర్జాతీయ గొలుసుకట్టు (MLM) ముఠా నయా పన్నాగాన్ని భగ్నం చేశారు. డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ముసుగులో అమాయక ప్రజలను నిలువునా ముంచేందుకు సిద్ధమైన గొలుసుకట్టు ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. గతంలో నిషేధానికి గురైన 'క్యూనెట్' సంస్థ, సరికొత్తగా 'ఇగ్నైట్' (IGNITE) పేరుతో అవతారమెత్తి చేయాలనుకున్న దాదాపు రూ. 5,000 కోట్ల భారీ మోసాన్ని మొగ్గలోనే తుంచేశారు. ఈ ముఠా గుట్టును పసిగట్టిన హైదరాబాద్ సిటీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం చాకచక్యంగా వ్యవహరించింది. ఈ నయా సంస్థ ఏర్పాటైన కేవలం 18 రోజుల్లోనే దాడి చేసి దేశవ్యాప్తంగా జరగబోయే దాదాపు రూ.5,000 కోట్ల భారీ మోసాన్ని ఆపడంతో పాటు కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నాలుగు రాష్ట్రాలలో విస్తరించిన ఈ ముఠాకు చెందిన ఆరుగురిని గురువారం హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

డబ్బంతా ఆ బ్యాంక్‍లోకి:

బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయగా నిందితులు వాట్సాప్, జూమ్ కాల్స్, షాపింగ్ మాల్స్ వంటి వేర్వేరు మార్గాల్లో ఎర వేసి రూ. 60 వేల చొప్పున వసూలు చేసి, కోల్‌కతాలోని భవానీపూర్ శాఖకు చెందిన 'పారస్‌నాథ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్' ఖాతాలో జమ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు వేర్వేరు మార్గాల్లో ముగ్గురు బాధితులను నమ్మించి రూ. 1.87 లక్షలు కాజేసిన ఘటనపై 2026 జూన్ 5, 6 తేదీల మధ్య పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మూడు ఘటనలపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదైనప్పటికీ, గతంలో నిషేధానికి గురైన 'క్యూనెట్' సంస్థ కొత్త రూపంలో మళ్లీ రంగంలోకి దిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో తదుపరి విచారణ నిమిత్తం సీపీ కార్యాలయం ఈ కేసును సీసీఎస్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

25 ఏళ్ల మోసాల చరిత్ర - 7 దశల మనీ ట్రయిల్:

ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ హాంగ్‌కాంగ్ కేంద్రంగా గత 25 ఏళ్లుగా గోల్డ్‌క్వెస్ట్, క్వెస్ట్‌నెట్, క్యూనెట్, ప్రస్తుతం 'ఇగ్నైట్'గా పేరు మార్చుకుని అమాయకులను దోచుకుంటోందని పోలీసులు తెలిపారు. భారత్‌లో దీని కోసం మే 18, 2026న 'ఇండి కనెక్ట్ వెంచర్స్' పేరిట డమ్మీ సంస్థను పెట్టారని పేర్కొ్నారు. చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పే 'సిమెట్రా' (Semetra) అనే అయస్కాంత పెన్, శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే 'యాక్టివా' (Activa) అనే చతురస్రాకార గాజు ముక్క, భారతీయ రిటైల్ మార్కెట్లో రూ. 600ల కంటే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ టూత్బ్రష్ను 'బ్రష్-ఓ' (Brush-O) పేరిట ఏకంగా 680 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ. 60,000) విక్రయించడం, అలాగే 'బ్రెయినిఫై' (brAInify) అనే ఏఐ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ వంటివి ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆరోగ్యం లేదా వెల్నెస్ గురించి ఈ ఉత్పత్తులపై చేస్తున్న ప్రచారాలకు సంబంధించి భారతీయ లేదా అంతర్జాతీయ నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ లేవని పోలీసులు తెలిపారు.

నిందితుల వివరాలు:

అరెస్టయిన వారిలో ఒనియల్ గుప్తా (ఇగ్నైట్ టీమ్ లీడర్-ఢిల్లీ), దినేష్ కుమార్ సాహిల్, ప్రియాన్షు సక్సేనా (డైరెక్టర్లు, ఇండి కనెక్ట్ వెంచర్స్-యూపీ), ప్రవీణ్ కుమార్, పరితోష్ కుమార్ (డైరెక్టర్లు, పారస్‌నాథ్ మెర్కంటైల్-కోల్‌కతా), మరియు రియాజ్ (ఫీల్డ్ రిక్రూటర్-కేరళ) ఉన్నారని నిందితులపై BNS, తెలంగాణ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు పత్మన్ సేనాథిరాజా, విజయ్ ఈశ్వరన్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఇటువంటి సంస్థలలో చేరి ఇతరులను చేర్పిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రజలను హెచ్చరించారు.

Next Story