పుట్ట మధుపై విమర్శలు సహించం.. బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

by Kodari Anjali |

మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధుపై నిరాధార విమర్శలు చేయడం తగదని కమాన్‌పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తాటికొండ శంకర్ హెచ్చరించారు.

పుట్ట మధుపై విమర్శలు సహించం.. బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక
X

దిశ, కమాన్‌పూర్: మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధుపై నిరాధార విమర్శలు చేయడం తగదని కమాన్‌పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తాటికొండ శంకర్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్తారం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్‌పై నమోదైన కేసు రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. అధికార పార్టీని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం వ్యవహరించడం ఆందోళనకరమని విమర్శించారు.

ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని, హామీలను పక్కనబెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పుట్ట మధు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేశారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తారని, పుట్ట మధు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెంచికల్‌పేట్ సర్పంచ్ పల్లె మాధవి–నాయరాయణ, గుర్రం లక్ష్మీమల్లు, కొట్టె భూమయ్య, బొమ్మగాని అనిల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story