పాదాలు చల్లగా ఉంటున్నాయా?.. మీ శరీరంలో ఉన్న సమస్య ఇదే!

by Javid Pasha |

డయాబెటిస్, థైరాయిడ్, హైపోథైరాయిడిజం, రక్తనాళాల సంకోచం వంటివి కోల్డ్‌ఫీట్ సమస్యకు కారణం అవుతుంటాయి.

పాదాలు చల్లగా ఉంటున్నాయా?.. మీ శరీరంలో ఉన్న సమస్య ఇదే!
X

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడు పాదాలు చల్లగా ఉండటం సాధారణమే. ముఖ్యంగా చల్లని వాతావరణంలో, ఏసీ గడిలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. కానీ గది ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా, వేడి వాతావరణంలో ఉన్నా అలాగే చల్లబడుతున్నాయంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది అనారోగ్య సంకేతం. రక్త ప్రసరణ తగ్గడం, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందకపోవడం కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు..

పాదాలు చల్లగా (Cold feet) ఉండటం, ముఖ్యంగా కాలివేళ్లు, అరికాళ్లు తరచుగా చల్లబడుతూ ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రధానంగా రక్త ప్రసరణలోపాలు దీనికి కారణం అవుతుంటాయి. అంతేకాకుండా డయాబెటిస్, థైరాయిడ్, హైపోథైరాయిడిజం, రక్తనాళాల సంకోచం (Peripheral Artery Disease), ధూమపానం, అధిక ఒత్తిడి, రక్తం తక్కువగా ఉండటం, విటమిన్ B12 లోపం వంటివి ఈ సమస్యకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోకుండా ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా రక్తప్రసరణ తగ్గుతుంది. ఈ కోల్డ్ ఫీట్ సమస్యవల్ల కాళ్లల్లో తిమ్మిర్లు, మంట, చర్మం రంగు మారడం, గాయాలు త్వరగా మానకపోవడం లాంటివి తలెత్తుతాయి. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాదాలు చల్లబడటానికి ప్రధాన కారణం రక్తప్రసరణ తగ్గడం, కాబట్టి దానిని మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీళ్లు తాగడం, ధూమపానం మానివేయడం, బరువు నియంత్రణలో ఉంచడం వంటి చిన్న చిన్న అలవాట్లతో ఈ సమస్య దూరం అవుతుంది. పాదాలను వేడి నీటితో కడగడం, సరైన షూస్ ధరించడం కూడా కొంత వరకు సహాయపడుతుంది. జాగ్రత్తలు పాటించినా సమస్య తగ్గకపోతే.. దీర్ఘకాలికంగా పాదాలు చల్లబడే(Cold feet) సమస్య వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలను పాటించాలి.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story