- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణేలో CJP సభ.. కాసేపట్లో ఎడ్యుకేషన్ మ్యానిఫెస్టో
కాక్‌రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పుణేలోని ప్రతిష్టాత్మక పూణే యూనివర్సిటీ క్యాంపస్‌లో భారీ బహిరంగ సభతోపాటు, ఆందోళన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో నీట్ (NEET), ఇతర రిక్రూట్‌మెంట్, ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం, యువతలో వ్యక్తమవుతున్న తీవ్ర ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ మహారాష్ట్రలోని పుణే వేదికగా ఒక భారీ నిరసన సభ ప్రారంభమైంది. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈరోజు పుణేలోని ప్రతిష్టాత్మక సావిత్రీబాయి ఫూలే పూణే యూనివర్సిటీ (SPPU) క్యాంపస్‌లో భారీ బహిరంగ సభతోపాటు, ఆందోళన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో దేశంలో విద్యా వ్యవస్థ సంస్కరణలే ధ్యేయంగా రూపొందించిన అత్యంత కీలకమైన 'ఎడ్యుకేషన్ మ్యానిఫెస్టో'ను ఆ పార్టీ విడుదల చేయనుంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
ప్రముఖ యువ నేత అభిజీత్ దిప్కే నేతృత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో.. పరీక్షల్లో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలను అరికట్టడం, అన్ని రకాల పరీక్షా ఫలితాలను సకాలంలో మరియు పారదర్శకంగా విడుదల చేయడం, రిక్రూట్‌మెంట్ & ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో పూర్తి స్థాయి జవాబుదారీతనాన్ని తీసుకురావడం వంటి డిమాండ్లను ఈ మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. దేశంలో విద్యా వ్యవస్థను మరియు విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరసనకారులు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
కదిలివచ్చిన సోనం వాంగ్చుక్.. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
ఈ నిరసన సభకు ప్రముఖ పర్యావరణ సామాజిక విద్యావేత్త, క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ కూడా విచ్చేసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి ఆయన మద్దతుగా నిలవడం సభలో మరింత ఉత్సాహాన్ని నింపింది. పుణేలోని ఈ సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ క్యాంపస్ సభ నుంచే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఆందోళనలు నిర్వహించి, చివరగా జూన్ 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబోయే భారీ ర్యాలీతో ఈ నిరసనల పర్వాన్ని ముగించనున్నట్లు సీజేపీ నేత అభిజీత్ దిప్కే వెల్లడించారు.






