ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి

by Jakkula.Mamatha |

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రభుత్వ సంక్షేమ పథకమా, లేక ప్రైవేట్ ఫైనాన్స్ పథకమా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి
X

దిశ, హిమాయత్ నగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రభుత్వ సంక్షేమ పథకమా, లేక ప్రైవేట్ ఫైనాన్స్ పథకమా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో 8, 9 ప్రతులను విద్యార్థులు చించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, వేముల రామకృష్ణలు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జీవోలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేసి, వారంలోపు కళాశాలలకు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టం అమలు చేస్తారా, వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతారా అని ప్రశ్నించారు. విద్యార్థులపై జులుం ప్రదర్శించడం, వారిని చిన్నచూపు చూడటం సరికాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, దాని అమలులో జాప్యం ఎందుకని ప్రశ్నించిన ఆయన, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలలో కమిషన్లు రావని కారణంగానే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ఉద్యోగ అవకాశాలు వచ్చినా సర్టిఫికెట్లు లేక విద్యార్థులు వాటిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఫీజుల బకాయిల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మరో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని, 14 లక్షల మంది విద్యార్థులను ఏకం చేసి అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోరాట కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ కృష్ణ విద్యార్థి సంఘం నేతలు ఉదయనేత, శివకుమార్, వినయ్, రాంబోల్ నాయక్, ప్రవీణ్, హరీష్, రమ్య ,వాణి, హరిత, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Next Story