సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై వేలాడుతూ వ్యక్తి హల్‌చల్

by Jakkula.Mamatha |

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి వేలాడుతూ కలకలం సృష్టించాడు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై వేలాడుతూ వ్యక్తి హల్‌చల్
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి వేలాడుతూ కలకలం సృష్టించాడు. రద్దీ సమయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో 32 ఏళ్ల వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించాడు. కొద్దిసేపటికే అసహజంగా ప్రవర్తిస్తూ కేకలు వేయడం, ప్లాట్‌ఫారమ్‌లపై అటూ ఇటూ పరుగులు తీయడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అనంతరం అతడు నాలుగో నంబర్ ప్లాట్‌ఫారమ్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకి ఎక్కి కిందకు వేలాడాడు. అదే సమయంలో పట్టాలపై రైళ్లు రాకపోకలు సాగుతుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై కిందకు దూకవద్దంటూ కేకలు వేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ సమయస్ఫూర్తి గల ప్రయాణికుడు వెంటనే స్పందించి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని పైకి లాగి ప్రాణాలు కాపాడాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో ఆ వ్యక్తిని మెదక్ జిల్లా చేగుంట మండలం తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన కరణ్ తోర్ రతన్‌గా గుర్తించారు. అతడు కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు రైల్వే పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి రతన్‌ను వారి సంరక్షణలో అప్పగించారు.

Next Story