భర్త సూచనలు.. సింధు విజయం: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆసక్తికర ఘటన

by Ramesh Naini |

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

భర్త సూచనలు.. సింధు విజయం: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆసక్తికర ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 22-20, 21-12 తేడాతో స్వదేశానికే చెందిన ఇషారాణి బారువాపై విజయం సాధించింది. అయితే, 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు భర్త వెంకట దత్త సాయి అనూహ్యంగా కోచ్‌ అవతారమెత్తి అందరి దృష్టిని ఆకర్షించారు.

భర్తకు రెండు వార్నింగ్‌లు..

మ్యాచ్ సమయంలో సింధు కొద్దిగా అసౌకర్యానికి గురికావడంతో, మానసిక స్థైర్యం కోసం తన బాక్స్‌లోకి రావాలని భర్త దత్త సాయిని కోరింది. ప్రత్యర్థి కూడా భారత క్రీడాకారిణే కావడంతో, మ్యాచ్‌ నిష్పక్షపాతంగా ఉండాలనే ఉద్దేశంతో సింధు తన అధికారిక కోచ్‌ను పిలవలేదు. వృత్తిరీత్యా స్పోర్ట్స్ డేటా సైంటిస్ట్ అయిన దత్త సాయి.. కేవలం నైతిక మద్దతు కోసమే వచ్చి, ఆ తర్వాత మ్యాచ్‌ను చక్కగా విశ్లేషించారు. రెండో గేమ్ నాటికి ప్రత్యర్థి ఆటతీరును పూర్తిగా అంచనా వేస్తూ సింధుకు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో ఉత్సాహంతో నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనకు అంపైర్ రెండు హెచ్చరికలు (వార్నింగ్‌లు) కూడా ఇచ్చారు.

‘ఎక్స్’ వేదికగా సింధు సరదా పోస్ట్

ఈ ఆసక్తికరమైన విషయాన్ని సింధు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘భర్త స్పోర్ట్స్ ఫ్యానటిక్ అయితే ఇలాగే ఉంటుంది. కేవలం ఎమోషనల్ సపోర్ట్ కోసం వచ్చి, అంపైర్ చేత రెండు వార్నింగ్‌లు తిని, ఎలాగోలా కార్డు పడకుండా తప్పించుకున్నారు. కానీ, రెండో గేమ్ కల్లా ఇషారాణి ఆటను పాయింట్ టూ పాయింట్ అంచనా వేశారు’ అంటూ సరదాగా రాసుకొచ్చింది. ఈ విజయంతో సింధు ఈ ఏడాది ఐదోసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరినట్లయింది. తదుపరి మ్యాచ్‌లో ఆమె చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యుతో తలపడనుంది.

Next Story