ఓయూ మూల్యాంకనం పై విద్యార్థుల ఆగ్రహం

by Batti.Sumithra |

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల మూల్యాంకన విధానం పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఓయూ మూల్యాంకనం పై విద్యార్థుల ఆగ్రహం
X

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల మూల్యాంకన విధానం పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం, అనంతరం రీ వాల్యుయేషన్‌లో వారిలో అధిక శాతం మంది పాస్ కావడంతో పేపర్ మూల్యాంకన ప్రక్రియ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారం ప్రకారం ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల్లో సుమారు 1,500 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరిలో గత సెమిస్టర్లలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పలువురు విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రీవాల్యుయేషన్ కోసం ఒక్కో విద్యార్థి రూ.700 ఫీజు చెల్లించగా, దరఖాస్తు చేసిన దాదాపు 1,000 మంది విద్యార్థులు పాస్ కావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా మొదట ఫెయిల్‌గా ప్రకటించిన ఎనిమిది మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్ అనంతరం ఫస్ట్ గ్రేడ్ మార్కులు రావడం మూల్యాంకన విధానం పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫెయిల్ అయిన విద్యార్థులు తర్వాత ఫస్ట్ గ్రేడ్ మార్కులు సాధించడం ఎలా సాధ్యమైంది ? మొదటి మూల్యాంకనలో తప్పిదాలు జరిగాయా ? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. భారీ సంఖ్యలో ఫలితాలు మారడం వల్ల మొదటి మూల్యాంకన విశ్వసనీయత పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది విద్యార్థులు రీవాల్యుయేషన్ ఫీజుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని, దీనిపై విశ్వవిద్యాలయం స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇక ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల కావడం, మార్చిలో నిర్వహించిన జర్నలిజం సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇప్పటికీ వెలువడకపోవడం కూడా విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఎల్‌బీ ఫలితాల వ్యవహారం పై స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని, మూల్యాంకన ప్రక్రియను పూర్తిగా సమీక్షించాలని, తప్పిదాలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story