- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో రాజీపడొద్దు : మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో రాజీ పడొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

దిశ, గండిపేట : డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో రాజీ పడొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 28 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు పరేడ్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు. మొత్తం 117 మంది అధికారులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర యువతను మాదకద్రవ్యాలు, గంజాయి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారుల పై ఉందన్నారు.
డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాల పై ఉక్కుపాదం మోపుతూ నేరాలను అరికట్టాలని సూచించారు. విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని మంత్రి అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ఏమాత్రం రాజీ పడొద్దు అని సూచించారు. రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి అధికారి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, శిక్షణాధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న వారు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






