- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకుల్లో ‘నో క్యాష్’.. రైతుల కష్టాలకు అంతే లేదు
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతులకు బ్యాంకుల నగదు కొరత పెద్ద సమస్యగా మారింది.

దిశ, ఆలూర్ : వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతులకు బ్యాంకుల నగదు కొరత పెద్ద సమస్యగా మారింది. ధాన్యం విక్రయించి తమ ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినప్పటికీ, అవసరమైన సమయంలో ఆ డబ్బును పూర్తిగా తీసుకునే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ రోజుకు కేవలం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు, ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలూర్ మండలానికి చెందిన ఓ రైతు ఇటీవల కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాడు.
ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు తన బ్యాంకు ఖాతాలో జమ కావడంతో వ్యవసాయ పనుల కోసం డబ్బులు తీసుకునేందుకు స్థానిక బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంకు అధికారులు నగదు కొరత ఉందని, రోజుకు పరిమిత మొత్తమే చెల్లించగలమని చెప్పడంతో నిరాశ చెందాడు. హార్వెస్టర్ కిరాయి, ట్రాక్టర్ అద్దె, కూలీల వేతనాలు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల కోసం లక్ష రూపాయలకు పైగా అవసరం ఉన్నప్పటికీ చేతికి వచ్చినది మాత్రం కొన్ని వేల రూపాయలే. ఇలాంటి పరిస్థితి ఒక్క రైతుదే కాదు. ఆలూర్, మాక్లూర్, ఆర్మూర్, నందిపేట్ మండలంతో పాటు జిల్లాలోని అనేక గ్రామాల్లో రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అవుతున్నా, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా తమ సొంత డబ్బును కూడా అవసరమైన సమయంలో పొందలేకపోతున్నారు.
వ్యవసాయ సీజన్‌లో మరింత ఇబ్బంది..
ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. భూముల దున్నకం, విత్తనాల కొనుగోలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల చెల్లింపులు వంటి పనుల కోసం పెద్ద మొత్తంలో నగదు అవసరం అవుతోంది. మరోవైపు ఇటీవల కోత పూర్తయిన పంటలకు సంబంధించిన హార్వెస్టర్ యజమానులు, ట్రాక్టర్ యజమానులు తమ బకాయిల కోసం రైతుల పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బ్యాంకులు పరిమిత మొత్తమే చెల్లిస్తుండటంతో రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
బ్యాంకుల వద్ద భారీ క్యూలు..
ఉదయం బ్యాంకులు తెరవకముందే రైతులు, ఖాతాదారులు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. గంటల తరబడి క్యూలలో నిలబడి చివరకు కొద్దిపాటి నగదు మాత్రమే తీసుకుని వెనుదిరుగుతున్నారు. కొందరు రైతులు వరుసగా మూడు, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు వెళ్లి తమ అవసరమైన మొత్తాన్ని సేకరించాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో వ్యవసాయ పనులు కూడా ఆలస్యం అవుతున్నాయి.
నో క్యాష్’ బోర్డులతో నిరాశ..
మండలంలోని పలు బ్యాంకు శాఖల వద్ద నగదు కొరత కారణంగా పరిమిత చెల్లింపులు మాత్రమే చేస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేసినట్లు రైతులు చెబుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా నగదు రూపంలో ఇవ్వలేకపోవడం వల్ల ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ లావాదేవీలపై ఆధారపడాలంటున్న బ్యాంకర్లు..
బ్యాంకు అధికారులు మాత్రం ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరగడం, నగదు సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులను వినియోగించాలని సూచిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, వృద్ధ రైతులకు ఇవి అంత సులభం కాదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
రైతుల ఆవేదన..
మా ఖాతాల్లో లక్షల రూపాయలు ఉన్నా అవసరమైన సమయంలో మా డబ్బులు మేమే తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనులు, కూలీల చెల్లింపులు, విత్తనాల కొనుగోళ్లు అన్నీ నిలిచిపోతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి బ్యాంకుల్లో నగదు కొరత సమస్యను పరిష్కరించాలి అని రైతులు కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి..
ధాన్యం విక్రయించిన రైతులకు అవసరమైన నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల చెల్లింపులు జరిగిన సమయంలో బ్యాంకుల్లో ప్రత్యేకంగా నగదు నిల్వలు ఉంచాలని, రోజువారీ ఉపసంహరణ పరిమితిని కనీసం రూ.50 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.






