34 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మిత్రులు

by Batti.Sumithra |

మూడు దశాబ్దాలకు పైగా గడిచినా స్నేహబంధాల మాధుర్యం ఏమాత్రం తగ్గలేదని దోమల్‌గూడా ప్రభుత్వ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ 1992-93 యూజీడీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.

34 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మిత్రులు
X

దిశ, చంపాపేట్ : మూడు దశాబ్దాలకు పైగా గడిచినా స్నేహబంధాల మాధుర్యం ఏమాత్రం తగ్గలేదని దోమల్‌గూడా ప్రభుత్వ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ 1992-93 యూజీడీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు. 34 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందం, ఆప్యాయత, అనుబంధాలు, మధుర జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థి, ఫిజికల్ డైరెక్టర్ దువ్వాల రవి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుంచి దాదాపు 60 మంది పూర్వవిద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై కళాశాల రోజుల అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థి దశలోని సంఘటనలు, క్రీడాపోటీలు, అధ్యాపకులతో అనుబంధాలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను పరస్పరం పంచుకుంటూ ఆ రోజులను మరోసారి సజీవం చేసుకున్నారు.

సంవత్సరాలుగా కలుసుకుని స్నేహితులను చూసి పలువురు ఆనందభాష్పాలు పెట్టడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సహచరులను అభినందిస్తూ వారి విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు తెలుగు రాష్ట్రాల ఫిజికల్ డైరెక్టర్లు మాట్లాడుతూ ఇంతటి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించిన దువ్వాల రవిని ప్రత్యేకంగా అభినందించారు. దూర ప్రాంతాల్లో ఉన్న సహచరులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, స్నేహబంధాలను మరింత బలోపేతం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్నేహానికి కాలపరిమితి లేదని, అనుబంధాలకు దూరం అడ్డుకాదని చాటిచెప్పిన ఈ సమ్మేళనం పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలింది.

Next Story