మిడిల్ ఈస్ట్‌లో భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి క్లోజ్

by Prasad Jukanti |   (  Updated:2026-06-11 02:04:59  IST  )

పశ్చిమాసియాలో మళ్లీ భీకర యుద్ధం మొదలైంది. దీంతో హర్ముజ్ జలసంధి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

మిడిల్ ఈస్ట్‌లో భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి క్లోజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి హెచ్చరించిన కొద్దిసేపటికే ఇరాన్‌పై అమెరికా సైన్యం భీకర దాడులకు దిగింది. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పశ్చిమ టెహ్రాన్, ఫార్స్ ప్రావిన్స్, బందర్ అబ్బాస్, కేష్మ్ ద్వీపం, కిష్, మినాబ్, మరియు మధ్య ఇస్ఫాహన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులు చేస్తోంది. అమెరికా దాడులకు ప్రతీగా ఇరాన్‌ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)' రంగంలోకి దిగింది. తమ ఏరోస్పేస్, నౌకాదళాలు కలిసి అమెరికా దళాలపై రెండు విడతలుగా వ్యూహాత్మక దాడులు చేసినట్లు ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తో పాటు కీలకమైన అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది.

హార్ముజ్ క్లోజ్:

ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రాంతీయ అభద్రతా పరిస్థితుల దృష్ట్యా చమురు ట్యాంకర్లతో సహా అన్ని వాణిజ్య ఓడల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు IRGC ప్రకటించింది. "హోర్ముజ్ జలసంధిని అశాంతికి గురిచేస్తే ఇరాన్ నలుమూలల నుండి ఈ ప్రాంతాన్ని మీకు నరకంగా మారుస్తాం అని IRGC ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మాజిద్ మూసవి హెచ్చరించారు.

దాడులు ఆగవు:

ఈ దాడులపై ట్రంప్ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడుతూ.. ఇరాన్ లోపల ఉన్న లక్ష్యాలపై తాము 49 టోమహాక్ క్షిపణులను ప్రయోగించామని, వాటిలో కొన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ సమీపంలోని రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని, ఇరాన్ అధికారులు తమతో శాంతి ఒప్పందంపై సంతకం చేయకపోతే రేపు రాత్రి కూడా బాంబుల దాడి కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ టాప్ అధికారులు తనకు ఫోన్ చేసి బాంబు దాడులను ఆపాలని కోరినట్లు కూడా ట్రంప్ క్లెయిమ్ చేయగా ఈ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా పూర్తిగా ఖండించింది. అదంతా అబద్ధమని కొట్టిపారేసింది.కాగా ఇరుదేశాల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. కాగా ఈ యుద్ధం వల్ల కొన్ని నెలలపాటు హర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం నుంచి భారత్ సహా ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరోసారి దాడులు పెరడగం జలమార్గం క్లోజ్ చేస్తున్నామనే ప్రకటన రావడంతో దేవుడా మళ్లీ మొదటికి వచ్చిందా అనే టాక్ వినిపిస్తోంది.

Next Story