- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు శాఖల సమన్వయ లోపం.. పేదవాడికి శాపం
ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఎంతో అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది.

దిశ, గుండాల : ప్రభుత్వం పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఎంతో అట్టహాసంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ఏడాది పైగా గడిచినా పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలన్న ప్రభుత్వ ఆశయం ఏజెన్సీ ప్రాంతంలో నీరుగారుతోంది. ఏజెన్సీ ప్రాంతంలోని నాలుగు శాఖలైన అటవీ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖల మధ్య సమన్వయ లోపం, స్పష్టమైన ఆదేశాలు, జీవోలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1/70 చట్టం, ఐదో షెడ్యూల్ భూభాగం, పీసా చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఆదివాసీలకు భూమి, నీరు, చెట్ల పై పూర్తి హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించింది. అయితే గుండాల మండలంలో గిరిజన హక్కులను అధికారులు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గుండాల గ్రామపంచాయతీలో ఇందిరమ్మ పథకం కింద 101 ఇళ్లు మంజూరయ్యాయి. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో లబ్ధిదారులు పాకలు తొలగించి గృహ నిర్మాణాలు ప్రారంభించారు. కానీ ప్రస్తుతం ఇసుక కొరత కారణంగా వారి ఆశలు అడియాసలుగా మారుతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు, ఇసుక సమస్య కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుండాల ప్రాంతంలో ఇసుక కొరత, ఇసుక రవాణాపై ఆంక్షలు, నిర్మాణాలు నిలిచిపోవడం వంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ కనిపించలేదు. అయితే గత రెండు మూడు నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకురావడం కూడా కష్టసాధ్యంగా మారింది. దీనికి కారణం పాలకుల వైఫల్యమా, అధికారుల వైఫల్యమా, లేక ట్రాక్టర్ యజమానుల మధ్య సమన్వయ లోపమా అనే అంశంపై ఆత్మపరిశీలన అవసరం.
ఇన్నేళ్లుగా భవనాలు, అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాలు, కల్వర్టుల నిర్మాణాలకు ఇసుకను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించారు. కానీ గత రెండు మూడు నెలలుగా ఇసుక దొరకకపోవడానికి గల కారణాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక పై పూర్తి అధికారం కలిగిన మైనింగ్ శాఖ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సమయంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. ఆ హామీ అమలు కాకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది.
కొన్ని సంవత్సరాలుగా గుండాల గ్రామానికి సమీపంలోని కిన్నెరసాని వాగు నుంచి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను తీసుకొచ్చేవారు. అయితే మూడు నెలల క్రితం పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి వాగు ప్రాంతంలో జేసీబీ సహాయంతో కందకం తవ్వించి ఇసుక రవాణాను నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో గృహ నిర్మాణాలు ఎలా సాగుతాయనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, గిరిజన హక్కులు కాలరాయబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరతరాలుగా సొంతింటి కల నెరవేరక ఎదురుచూస్తున్న గిరిజనులు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఇసుక సమస్య అడ్డంకిగా మారింది.
ఇసుక రవాణా నిలిచిపోవడానికి మరో కారణం ట్రాక్టర్ యజమానుల మధ్య ఉన్న విభేదాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుకకు వెళ్లినప్పుడు మరో ట్రాక్టర్ యజమాని పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి ఇసుకను పట్టించే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. ట్రాక్టర్ యజమానుల మధ్య ఉన్న ఈ విభేదాల వల్ల సాధారణ ప్రజలే నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజలు ఇకనైనా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, అక్రమ సమాచారం ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆలోచించాలి...
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇందిరమ్మ గృహాలు, ఇతర గృహ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను స్థానికంగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలం దాటి ఇసుక తరలిపోకుండా కఠిన నిబంధనలు అమలు చేసి, మైనింగ్ అధికారులు ప్రత్యేక స్లిప్పులు జారీ చేసి ఇసుక సరఫరాను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవని అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇసుక సమస్య ఎటువైపు దారి తీస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఏజెన్సీ ప్రాంతంలో గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక రవాణాకు సహకరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.






