హోర్డింగ్ బోర్డుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం

by Batti.Sumithra |

నివాస, వాణిజ్య సంస్థల హోర్డింగ్ బోర్డులను భవనాల పై, రహదారుల పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న భారీ కటౌట్ బోర్డులు (హోర్డింగ్స్) ప్రాణాపాయానికి కారణమవుతున్నాయి.

హోర్డింగ్ బోర్డుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, తల్లాడ: నివాస, వాణిజ్య సంస్థల హోర్డింగ్ బోర్డులను భవనాల పై, రహదారుల పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న భారీ కటౌట్ బోర్డులు (హోర్డింగ్స్) ప్రాణాపాయానికి కారణమవుతున్నాయి. బలమైన ఈదురు గాలులు, వర్షాల సమయంలో ఇవి నేలకూలడం లేదా తుఫానుల సమయంలో కూలిపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి దృశ్యమే తల్లాడ మండలంలోని అంబేద్కర్‌నగర్ సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీయడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన భారీ కటౌట్ (హోర్డింగ్ బోర్డు) నేలకూలింది. ఇది ఖమ్మం–తల్లాడ జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గాలి దుమారం కారణంగా నేలకూలిన ఈ భారీ కటౌట్ వాహనాల పై పడితే జరిగే ప్రమాదం తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ సంస్థలు తమ స్వలాభం కోసం జాతీయ రహదారుల వెంబడి ఇలాంటి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడంతో, ఈదురుగాలులు లేదా వర్షాల సమయంలో హోర్డింగ్ బోర్డులు కూలిపోవడం వల్ల కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ బోర్డులు కూలిపోతే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు ఈ కటౌట్లు పాత ఇనుప రాడ్లు, బలహీనమైన నిర్మాణాలతో తయారు చేస్తుంటారు. సాంకేతిక ధ్రువీకరణ లేకపోవడం వల్ల ఇవి కొద్దిపాటి గాలినే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ కోసం జాతీయ రహదారులపై ఇలాంటి బోర్డుల ఏర్పాటును ప్రభుత్వం నిషేధించింది. పట్టణాల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ కటౌట్లను తొలగించడం, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. అనధికారిక హోర్డింగ్ బోర్డుల వల్ల కలిగే నష్టాలు, వాటి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు చొరవ తీసుకుని నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story