అడ్డంగా దొరికిపోయిన 'లోటస్'.. కళ్ళు మూసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు!

by Malleboina Mahesh |

మదీనాగూడ పటేల్ చెరువులో లోటస్ ఇన్‌ఫ్రా అక్రమాలకు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి సహకారం అందించినట్లు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

అడ్డంగా దొరికిపోయిన లోటస్.. కళ్ళు మూసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగంపల్లి మదీనాగూడ పటేల్ చెరువు బఫర్ జోన్‌లో 'లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్' ఐదంతస్తుల భవనాలు ఏవో రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు! కేవలం మియాపూర్ పటేల్ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణాలు మాత్రమే చేశారనుకుంటే పొరపాటే. వాస్తవ పత్రాలలో ఉన్న కొలతలకు లెక్కల మాయాజాలం చేసి మరి అనుమతులు పొందినట్టు స్పష్టం అవుతుంది. ఇదంతా ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో, వారి పెన్నుల నుంచే పురుడుపోసుకున్న పక్కా స్కెచ్. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ , వారు గీసిచ్చిన టోపో మ్యాప్, చివరకు జీహెచ్ఎంసీ జారీ చేసిన బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తే... అసలు మున్సిపల్ అధికారుల స్థాయిలో ఎంతటి బరితెగింపు జరిగిందో, చట్టాలను ఎలా చుట్టాలుగా మార్చుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. అసలు లోపం ఎక్కడ జరిగిందో చూపిస్తున్న "డాక్యుమెంటరీ .. గణిత సాక్ష్యాలు" ఇవే.

ఇరిగేషన్ చెప్పిన స్పష్టమైన లెక్క

2019 లో నార్త్ ట్యాంక్స్ డివిజన్, ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వేనెంబర్ 188 లో ఇచ్చిన ఎన్ వోసి'టోపో స్కెచ్' చాలా స్పష్టంగా ఉంది. అందులో దరఖాస్తుదారుని మొత్తం స్థలం 3857 చదరపు మీటర్లు అని, కుడివైపున చెరువు కట్ట వెంబడి 10 మీటర్ల నుంచి 17 మీటర్ల వెడల్పుతో ఏకంగా 771 చ.మీ. స్థలాన్ని డి ఎస్ బఫర్ జోన్ కింద వదిలేయాలని స్కెచ్ గీసి మరీ ఇచ్చారు. నిర్మాణాలకు పనికొచ్చే నికర స్థలం కేవలం 3086 చ.మీ. మాత్రమే అని ఆ పట్టికలో తేల్చి చెప్పారు.

కళ్లుగప్పేందుకు 'ప్లాట్ల ఏకీకరణ'

ఇరిగేషన్ రిపోర్ట్‌లోని 3857 చ.మీ. లెక్కను అలాగే తీసుకెళ్లి మున్సిపల్ పర్మిషన్‌కు పెడితే ఆ 771 చ.మీ. బఫర్ జోన్‌ను అధికారులకు వదిలేయాల్సి వస్తుంది. ఇక్కడే డెవలపర్లు అతిపెద్ద 'మాస్టర్ ప్లాన్' వేశారు. ఆ ఓపెన్ ప్లాట్‌కు పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 329, 330 లను కలిపేసి 'అమాల్గమేషన్' చేశారు. ఇరిగేషన్ పత్రం ప్రకారం ఓపెన్ ల్యాండ్ విస్తీర్ణం 3857 చ.మీ. ప్లాట్ 329, 330 విస్తీర్ణం 400 గజాలు. దీనిని మీటర్లలోకి మారిస్తే సుమారు 334.45 చ.మీ. ఈ రెండింటినీ కలిపితే (3857 + 334.45) 4191.45 చ.మీ. బిల్డింగ్ పర్మిషన్ పత్రంలో మున్సిపల్ అధికారులు చూపించిన మొత్తం ప్లాట్ ఏరియా 4190.72 చ.మీ. క్షేత్రస్థాయి కొలతల్లో స్వల్ప వ్యత్యాసాల వల్ల ఇది సరిపోయింది అనుకుందాము. అంటే స్థలాలను కలపడం వరకు కాగితాలపై ల్యాండ్ విస్తీర్ణం లెక్క కరెక్టే.

అసలు మాయ జరిగింది ఇక్కడే!

నిబంధనల ప్రకారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చే ముందు ఇరిగేషన్ ఎన్ ఓ సి ని క్రాస్ చెక్ చేయాలి. కానీ 2023 ఏప్రిల్‌లో జీహెచ్ఎంసీ జారీ చేసిన పర్మిషన్ పత్రంలో వివరాలను పరిశీలిస్తే చూస్తే వారి నిర్వాకం, అడ్డగోలు మోసం గణితం సాక్షిగా బయటపడుతుంది. మొత్తం స్థలం 4190.72 చ.మీ. నుంచి ఇరిగేషన్ శాఖ తప్పనిసరిగా వదలమన్న 771 చ.మీ. బఫర్ జోన్‌ను తీసివేయాలి. (4190.72 - 771 = 3419.72 చ.మీ.). అంటే నిర్మాణం చేసుకోవడానికి అనుమతించాల్సిన నికర స్థలం 3419.72 చ.మీ. మాత్రమే!

జీహెచ్ఎంసీ పర్మిషన్‌లో మాత్రం..!

అనుమతులు ఇచ్చే సమయంలో లోటస్ ఇన్ఫ్రా అక్రమ నిర్మాణానికి అప్పటి జిహెచ్ఎంసి అధికారులు పూర్తిగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతి పత్రాలలో అధికారులు బఫర్ జోన్ కటింగ్ చూపించలేదు సరికదా రోడ్డు కటింగ్ 0.0 చ.మీ., నాలా కటింగ్ 0.0 చ.మీ. అని రాశారు. మరి ఇరిగేషన్ శాఖ చెప్పిన ఆ 771 చ.మీ. బఫర్ కటింగ్ ఏది? దాన్ని ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారా..? మొత్తం స్థలంలో కేవలం 2.47 చ.మీ. మాత్రమే తీసేసి.. ఏకంగా 4188.25 చ.మీ. ని నికర స్థలంగా చూపించి పర్మిషన్ ఇచ్చేశారు. ఒక రక్షిత ఇరిగేషన్ బఫర్ జోన్‌ను మున్సిపల్ అధికారులు తమ పెన్నుతో, బ్లైండ్ అప్రూవల్‌తో బిల్డర్ చేతిలో పెట్టేసిన అసలు ఘట్టం ఇదే. అనుమతి పత్రాలలో 4188.25 చ.మీ. అని నికర స్థలాన్ని చూపించడం చట్టప్రకారం పూర్తిగా తప్పు అని స్పష్టం చేస్తున్నారు.

డ్రాయింగ్స్ చూసినా కళ్లు తెరవలేదా?

మరో విచిత్రం ఏమిటంటే.. డెవలపర్ జీహెచ్ఎంసీకి సమర్పించిన బ్లూప్రింట్ లో ఇరిగేషన్ మ్యాప్‌లో ఉన్న కుడివైపు 'ఏటవాలు గీత' అలాగే ఉంది. ఆ గీత వెంబడి కనీసం 17 మీటర్ల మేర ఎలాంటి భవనం గీయకూడదు. కానీ, ప్లాన్‌లో అపార్ట్‌మెంట్ డిజైన్‌ను నేరుగా ఆ ఏటవాలు సరిహద్దుకు ఆనుకుని గీశారు. బఫర్ జోన్‌ను కూడా కలిపేసి పర్మిషన్ ఇచ్చారు కాబట్టే.. ప్లాన్‌లో ఐదంతస్తుల భవనాలు ఏటవాలు సరిహద్దు లోపలికి వెళ్లాయి. సామాన్యులకు సైతం ఆ డ్రాయింగ్ చూస్తే బఫర్ జోన్‌లో భవనం ప్లాన్ చేశారని అర్థమవుతుంది.

కానీ, ప్లాన్‌ను ఆమోదించి సంతకాలు చేసిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ , సిటీ ప్లానర్ స్థాయి అధికారులకు మాత్రం ఆ ఉల్లంఘనలు కనిపించలేదా? లేక కోట్ల రూపాయల ఫీజులు, ఇతర 'ప్రయోజనాల' మత్తులో చూసీచూడనట్లు వదిలేశారా? అని తీవ్ర ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ ఇచ్చిన అభ్యంతర పత్రాన్ని పొయ్యిలో పెట్టి, అడ్డగోలు ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఆ టౌన్ ప్లానింగ్ అధికారులపై విజిలెన్స్ విచారణ జరిగితే తప్ప.. పటేల్ చెరువు ఆక్రమణ వెనుక దాగున్న 'లోటస్' లీలల పూర్తి నిజాలు బయటకు రావు అని చెప్తున్నారు. ఈ పక్కా లెక్కల సాక్ష్యాల ఆధారంగానైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు మిగిలిన ప్రశ్న.

Next Story