ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై టీ కాంగ్రెస్‍లో హాట్ డిస్కషన్

by Prasad Jukanti |   (  Updated:2026-06-11 04:50:55  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులపై అధిష్టానంతో సీఎం చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై టీ కాంగ్రెస్‍లో హాట్ డిస్కషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో (CM Revanth Reddy Delhi Tour) పర్యటిస్తున్నారు. ఇవాళ జరగనున్న నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అలాగే ఏఐసీసీ నేతలతోనూ ఆయన సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion), పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అధిష్టానం పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తుది దశకు మంత్రివర్గ విస్తరణ చర్చలు!:

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన రెండున్నరేళ్లు దాటిన నేపథ్యంలో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటుపై సీఎం దృష్టి సారించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆయన ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రివర్గంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయనే ప్రచారం గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా అధిష్టానంతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై నివేదికలుసైతం సమర్పించారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివేదికతో పాటు అధిష్టాన తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం ముగిసిపోవంతో పార్టీ పెద్దలు ఇక తెలంగాణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సీఎం చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని ఇవాళ భేటీలో కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఎవరికి ప్రమోషన్ ఎవరికి డీమోషన్?

రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తెలంగాణ కాంగ్రెస్‍లో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహుల జాబితా పెద్దగా ఉండటంతో తమకు ఏ మేరకు అవకాశం ఉండబోతోంది అనే దానిపై ఎవరికి వారు లెక్కులు వేసుకుంటున్నారు. మరో వైపు ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ మార్పులు తప్పేలా లేవనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో మంత్రుల్లో ఎవరికి ప్రమోషన్ మరెవరికి డిమోషన్ లభించబోతోంది అనేది చర్చగా మారింది.

Next Story