‘మమ్మల్ని రెండుగా విడగొట్టొద్దు.. ఒకే గ్రామంగా ఉంచాలి’.. ప్రధాన రహదారిపై ధర్నా

by Jakkula.Mamatha |

గంగాధర మండలం నారాయణపూర్ చెరువు/ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ నారాయణపూర్, ఇస్తారుపల్లె వాసులు భారీ ఆందోళన నిర్వహించారు.

‘మమ్మల్ని రెండుగా విడగొట్టొద్దు.. ఒకే గ్రామంగా ఉంచాలి’.. ప్రధాన రహదారిపై ధర్నా
X

దిశ, గంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ చెరువు/ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ నారాయణపూర్, ఇస్తారుపల్లె వాసులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మధురానగర్ గ్రామపంచాయతీ నుండి నారాయణపూర్ గ్రామం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై చేరుకుని సుమారు 15 నిమిషాల పాటు శాంతియుతంగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ధర్నా సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రాజెక్టు కట్ట నిర్మాణంలో భాగంగా గ్రామాన్ని సగానికి విడగొట్టి కొందరిని మాత్రమే పరిహారానికి పరిమితం చేయడం దారుణమన్నారు.

"మమ్మల్ని రెండుగా విడగొట్టొద్దు.. గ్రామాన్ని ఒకే యూనిట్‌గా ఉంచి అందరికీ న్యాయం చేయాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొందరి ఇళ్లను మాత్రమే ముంపు పరిధిలోకి తెచ్చి, మిగిలిన వారిని వదిలేయడం వల్ల గ్రామంలో విభేదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. గుండెకోతను వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మాట్లాడారు. తమ ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టు ద్వారా ఎన్నో ఇతర గ్రామాలకు, వేలాది ఎకరాలకు సాగునీరు, అందుతుందని, కానీ అంతటి ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న తమను మాత్రం నీటిలో ముంచివేసే పరిస్థితి తేవడం ఏంటని నిలదీశారు. ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో మిగిలిన ఇళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని, అందుకే అరకొరగా కాకుండా సమగ్రంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

నారాయణపూర్, ఇస్తారుపల్లె గ్రామాలకు ఈ ప్రాజెక్టు వల్ల సమాన స్థాయిలో నష్టం జరుగుతోందని బాధితులు తెలిపారు. కాబట్టి ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నారాయణపూర్, ఇస్తారుపల్లె గ్రామాలను సంపూర్ణంగా "ముంపు గ్రామాలుగా" ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సరైన పునరావాసం, నష్టపరిహారం కల్పించిన తర్వాతే పనులు ముందుకు తీసుకెళ్లాలని పట్టుబట్టారు. రహదారిపై ధర్నా కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగగా, పోలీసులు పదిహేను నిమిషాల అనంతరం నచ్చజెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ నిరసన కార్యక్రమంలో ముంపు బాధితులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story