- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా పోషక విలువలతో కూడిన బలమైన ఆహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ,మధిర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా పోషక విలువలతో కూడిన బలమైన ఆహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కేంద్రమైన మధిర విజయవాడ రోడ్ లో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో "హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మధిర మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, బలమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకు ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక చాలామంది ఉచిత పథకాల పైన విమర్శ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలు ప్రాజెక్టులు ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టినట్లుగానే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి పైన ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని ఆయన అన్నారు. ఈ పెట్టుబడి ఫలితాలు ప్రజలు అభివృద్ధి చెంది ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేసేవిగా ఉంటాయని ఆయన అన్నారు.
మధిర నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారాన్ని అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం ఉదయమే రుచికరమైన, శుచి-శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఏ బిడ్డ కూడా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదు.. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ.. రాష్ట్ర భవిష్యత్తు ఆని ఆయన చెప్పారు వారి భవిష్యత్తే మన భవిష్యత్తు. అటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసి చదువుకోవాలని అన్నారు. రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన న్యూట్రీషియస్ ఫుడ్ ని మనం అందించాలని చెప్పి ఈ క్యాబినెట్ చేసిన నిర్ణయం మేరకు బడ్జెట్ లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. మానవ వనరులు మన రాష్ట్ర సంపద. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా సహజ వనరులు ఎంత అవసరమో.. సమర్థవంతమైన మానవ వనరులు కూడా అంతే అవసరమని భట్టి విక్రమార్క నొక్కి వక్కాణించారు. అత్యంత ప్రతిభావంతులు తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం గాని, దేశం గాని ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా మారుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా దశా దిశా నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరులను సానబెట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదికి మనం వదిలి పెట్టగలగాలి. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సిన తరుణంలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించాల్సిన అంశమని అన్నారు. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు సమయానికి టిఫిన్ కట్టడమే తల్లిదండ్రులకు కష్టంగా మారిన రోజులివి. అలాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 20 లక్షల మంది, రెసిడెన్షియల్ స్కూళ్లలోని 7 లక్షల మంది పిల్లలతో కలిపి మొత్తం 27 లక్షల మందికి ఒకే సమయానికి వేడివేడిగా అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశంమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అల్పాహారం అందించే వ్యవస్థ లేదని భట్టి పేర్కొన్నారు. సంకల్పం మంచిదైతే భగవంతుని ఆశీస్సులు ఉంటాయని, అందుకే సాధ్యం కాదనుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం సాధ్యం చేసి చూపిందని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు.
హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో పకడ్బందీగా, అత్యంత శుభ్రమైన వాతావరణంలో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మధిరలోని తాత్కాలిక సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 16 మండలాల స్కూళ్లకు వాహనాల్లో అల్పాహారం అందిస్తున్నామని అన్నారు. రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత కిచెన్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. పిల్లలకు అందించే అల్పాహారంతో పాటు పౌష్టికాహారం కోసం వారానికి 3 రోజుల పాలు, మరో 3 రోజులు రాగి జావను ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారి కోసం రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గృహ ప్రవేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూస్తే.. ఇది కదా పాలన అనే అనుభూతి కలుగుతోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశానని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమయంలో బడుల దుస్థితి, నిరుద్యోగుల ఆవేదన, ఇల్లు లేని పేదల బాధలను విన్నానని చెప్పారు. ఆనాడే నా మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలే నేడు ఒక్కొక్కటిగా పథకాలుగా మారుతున్నాయని భావోద్వేగానికి లోనవుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ₹22,500 కోట్లతో మొదటి విడతలోనే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. మహాలక్ష్మి పథకంతో సగం జనాభా ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నాం.
మహిళలను కోటీశ్వరులను చేసేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటికే ₹67,000 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం. పేద కుటుంబ వైద్య పరిమితిని ఏకంగా ₹10 లక్షలకు పెంచాం. కోటి 6 లక్షల కుటుంబాలకు నెలకు మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని సుజాత మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు కమిషనర్ సామ్యూల్ పాల్ ఎంఈఓ మురళీధర్ రావు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






