రేపటి వరకే డెడ్‌లైన్.. కేంద్రానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అల్టిమేటం

by Gantepaka Srikanth |

కేంద్ర ప్రభుత్వం నిరసనకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు.

రేపటి వరకే డెడ్‌లైన్.. కేంద్రానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అల్టిమేటం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం నిరసనకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు. చర్చల్లో భాగంగా నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం, ప్రస్తుతం ఆ మాటను పక్కనబెట్టిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసన తెలిపిన విద్యార్థులపై మళ్లీ కొత్తగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నట్లు పలువురు విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు. బాధితులకు న్యాయం అందించేందుకు ఈ కేసులకు సంబంధించి సీజేపీ లాయర్లు చట్టపరంగా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

గతంలో ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. "రేపటిలోగా దేశవ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన అన్ని కేసులనూ బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేకపోతే కేంద్ర వైఖరికి నిరసనగా మరోసారి దేశవ్యాప్త పోరాటం తప్పదు" అని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

Next Story