- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు..?
కోదాడ మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అభివృద్ధి పనుల బిల్లులు, నిధుల వినియోగం పై నెలకొన్న అనుమానాలు నూతన పాలకవర్గ సమీక్ష సమావేశంలో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి.

దిశ, కోదాడ : కోదాడ మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అభివృద్ధి పనుల బిల్లులు, నిధుల వినియోగం పై నెలకొన్న అనుమానాలు నూతన పాలకవర్గ సమీక్ష సమావేశంలో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి. ఇటీవల కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గం తొలి సమీక్ష సమావేశం గురువారం జరగనుండగా, ప్రత్యేక అధికారుల పాలనలో చోటుచేసుకున్న నిధుల గోల్‌మాల్, పనుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల పై కౌన్సిలర్లు అధికారులను నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో గత కొంతకాలంగా జరిగిన అభివృద్ధి పనుల పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పనులు పూర్తికాకముందే బిల్లులు చెల్లించారని, మరికొన్ని పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజాప్రతినిధుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమావేశంలో అధికారులకు ఎదురయ్యే ప్రశ్నలు తీవ్రంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
సమావేశానికి దూరంగా ఉండే ప్రయత్నాలు..?
సమావేశంలో కౌన్సిలర్ల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు అధికారులు హాజరుకాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం మున్సిపల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు సెలవులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. మరికొందరు కూడా అనివార్య కారణాలను చూపిస్తూ సమావేశానికి దూరంగా ఉండేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదం పేరుతో సెలవు..?
మున్సిపాలిటీలో నిధుల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానంటూ వైద్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి 15 రోజుల సెలవు కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ సెలవు నిజంగానే ఆరోగ్య కారణాల రీత్యా తీసుకుంటున్నారా..? లేక సమావేశంలో ఎదురయ్యే ప్రశ్నలకు దూరంగా ఉండేందుకేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలాజీ నగర్‌లో నాలుగు ఎకరాల స్థలం పై చర్చ ఇలా ఉండగా, అదే అధికారికి సంబంధించిన మరో అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతంలో సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని తీసుకుని క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత పెద్ద స్థలాన్ని ఎలా సమకూర్చుకున్నారన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీనిపై కూడా సమావేశంలో కొందరు కౌన్సిలర్లు ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పాలకవర్గం దృష్టి ఏ దిశగా..?
కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి కీలక సమావేశం కావడంతో ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే నిలిచింది. గత పాలనలో జరిగిన ఖర్చులు, పనుల నాణ్యత, నిధుల వినియోగం పై పూర్తి స్థాయి సమీక్ష చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సమావేశానికి అధికారులు గైర్హాజరైతే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సమాధానాలు వస్తాయా..? ప్రశ్నలే మిగిలిపోతాయా..?
నిధుల వినియోగం పై అనుమానాలు, సమావేశానికి ముందే సెలవుల కలకలం, కీలక అధికారుల గైర్హాజరు ప్రచారం నేపథ్యంలో మున్సిపల్ సమావేశం ఆసక్తికరంగా మారింది. కౌన్సిలర్లు లేవనెత్తే ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెబుతారా..? లేక ప్రశ్నలే సమాధానం లేకుండా మిగిలిపోతాయా..? అన్నది వేచిచూడాల్సి ఉంది.






