- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాప్ ద్వారా యూరియా విక్రయాలు ప్రారంభం
మండల కేంద్రంలోని రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ తెలిపారు.

దిశ, నర్వ: మండల కేంద్రంలోని రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ తెలిపారు. ఈ మేరకు నర్వ వ్యవసాయ అధికారి అఖిలారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్వ మండలంలోని రైతులకు యూరియా ఎరువుల సరఫరాను మరింత పారదర్శకంగా, సులభతరంగా అందించేందుకు యూరియా యాప్ ద్వారా యూరియా విక్రయాలు ప్రారంభించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ వెల్లడించారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా సమీప ఎరువుల విక్రయ కేంద్రాల ద్వారా యాప్ సహాయంతో యూరియాను కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. అలాగే యూరియా లభ్యత, నిల్వలు, ఇతర వివరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5779 ద్వారా కూడా సమాచారం పొందవచ్చని సూచించారు. ప్రస్తుతం మక్తల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, యూరియా కొరత పై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పంటల దశను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే యూరియాను వినియోగించాలని, అధిక మోతాదులో వాడటం వల్ల పంటలకు, భూమి ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
యూరియా కొనుగోలు సమయంలో రైతులు తమ ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్ నమోదు చేయించుకోవాలని, రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. యూరియా వినియోగం, ఎరువుల యాజమాన్యం, పంటల పోషక నిర్వహణకు సంబంధించిన సందేహాలుంటే గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), మండల వ్యవసాయ అధికారులు (MAOలు)ను సంప్రదించి సలహాలు పొందాలని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాను వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ తెలిపారు. రైతులు యూరియా యాప్, టోల్‌ఫ్రీ సేవలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






