- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనం: కేటీఆర్

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనం అని కేటీఆర్ విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
యూరియా యాప్ నాటకం - లైన్లను దాచే కుట్ర:
రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచి పెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. "కేసీఆర్ గారికి రైతులపై ఉన్నట్లుగా గుండెల్లో ప్రేమ ఉంటే, రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రేమ, చిత్తశుద్ధి రెండూ లేవు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 'లైన్లను దాచే' ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.
READ MORE ....
దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: CM రేవంత్‌కు కేటీఆర్ సవాల్






