కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము లేకపోతే దిగిపో.. CM రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-07 12:49:28  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కిషన్ రెడ్డి స్పందించారు.

కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము లేకపోతే దిగిపో.. CM రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విసిరిన సవాల్‌కు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌(KCR)పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను కాదని.. కేసీఆర్‌ను కాపాడేది రేవంత్ రెడ్డే అని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌పై ఈగ వాలకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ బుల్లెట్‌పై కేసీఆర్ కూర్చుంటే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చుకున్నాడని ఆరోపించారు. అప్పుడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎంఐఎం పార్టీనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉంటే.. బహిరంగ ప్రకటన చేయాలని సవాల్ విసిరారు.

FSL అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు

ఎఫ్‌ఎస్ఎల్ అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అనేక కేసులకు సంబంధించిన ఆధారాలు ఎఫ్‌ఎస్ఎల్‌లో ఉన్నాయని అన్నారు. తమ అనుమానాలపై ప్రభుత్వం తక్షణమే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తుచేశారు.

సీఎం రేవంత్ ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే.. నిన్న నిజామాబాద్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాస్తా.. కల్వకుంట్ల కిషన్‌రావుగా మారిపోయారని మండిపడ్డారు. కేంద్రం చర్యలు తీసుకోకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటూ వస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే.. మూసీ నదిలో వేసినట్లేనని పేర్కొన్నారు.

CM Revanth Reddy: నువ్వు నీ తాతలు ఎవరు అడ్డువస్తారో రండి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

Next Story