CM Revanth Reddy: నువ్వు నీ తాతలు ఎవరు అడ్డువస్తారో రండి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

by Prasad Jukanti |   (  Updated:2026-02-07 12:48:43  IST  )

తెలంగాణలో రాబోయే 8 ఏళ్లు ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటుందని ఈ విషయాన్ని రాసిపెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ విసిరారు.

CM Revanth Reddy: నువ్వు నీ తాతలు  ఎవరు అడ్డువస్తారో రండి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు ఎన్నికుట్రలు ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తారు? అప్పుడే దిగిపో అంటున్నారు.. ఐదేళ్లకోసం అధికారంలోకి వచ్చాం.. మరో ఐదేళ్లు మేమే అధికారంలోకి వస్తాం.. చంద్రశేఖర్‌రావు.. కల్వకుంట్ల కిషన్ రావు(కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి) ఈరోజు నుంచి రాసిపెట్టుకోండి.. రాబోయే 8 సంవత్సరాలు తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది.. నువ్వు, నీ తాతలు ఎవరెవరు ఎన్నికల్లో అడ్డం వస్తారో రండి.. ఏ కుట్రలు చేస్తారో చేయండి.. చూద్దాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సవాల్ చేశారు. ఇవాళ ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) ప్రయత్నించడం లేదని విమర్శించారు. కేటీఆర్‌కు ఇన్నాళ్లూ వికారాబాద్‌, తాండూర్‌ ఎందుకు గుర్తురాలేదు.? రంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్‌కు ఎందుకు రాలేదని నిలదీశారు.

చంద్రబాబుకు సలహాలు తప్ప నీళ్లివ్వలేదు..

గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వాటిని తరలించుకుపోవాలని నాడు చంద్రబాబుకు కేసీఆర్ సలహాలు ఇచ్చారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లప్పగించి చూసిన కేసీఆర్.. అందులో 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 లక్షల ఎకరాలకు సాగు నీరు వచ్చి ఉండేది కదా అని ప్రశ్నించారు. ఏం పాపం చేశామని నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ. 38 వేలకోట్లతో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పూనున్నారన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందని, దాని వల్ల కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు వచ్చాయని ఆరోపించారు. గోదావరి జలాల ముసుగులో వేలకోట్లు కొల్లగొట్టారని మండపడ్డారు.

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తాం

సబితా ఇంద్రారెడ్డికి అన్ని పదవులు ఇచ్చినా ఆమె పార్టీ ఫిరాయించారని, నాడు రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నానని చెప్పిన ఆమె.. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎందుకు నిధులు, అనుమతులు తీసుకురాలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. చేసిన ద్రోహానికి ప్రజలను కలిసేందుకు సబితా ఇంద్రారెడ్డికి నైతిక హక్కు లేదని విమర్శించారు. పదేళ్లు కేసీఆర్, కేటీఆర్ మున్సిపాలిటీల వైపు చూడలేదని, కానీ తాము గోదావరి జలాలు తెచ్చి తాండూరు, వికారాబాద్ పరిగి ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‍కు భూసేకరణ చేసి త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. తాండూరుకు కాగ్నా నది నీళ్లు ఇస్తామన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము లేకపోతే దిగిపో.. CM రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Next Story