దొంగల హల్‌చల్.. సత్తుపల్లిలో వరుస చోరీలు

by Mahesh |
దొంగల హల్‌చల్.. సత్తుపల్లిలో వరుస చోరీలు
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో వరుసగా సెల్‌ఫోన్లు, టూవీలర్ల దొంగతనాలతో స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు ఫాలో అవుతూ హై టెక్నాలజీని ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. జనసంచారం లేని, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంపిక చేసుకొని టూ వీలర్‌పై ఒక వ్యక్తి కూర్చొని మరో వ్యక్తి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాటు వేసి చోరీ చేస్తున్నారు. ఇలా సత్తుపల్లిలో కొద్దిరోజులుగా పలువురి సెల్‌ఫోన్లతో పాటు బైకులు చోరీకి గురయ్యాయి. సత్తుపల్లి పరిసర ప్రాంతాలైన తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, దమ్మపేట, అశ్వరావుపేట, పరిసర ప్రాంతాలలో దొంగలు నెంబర్ ప్లేట్ లేని టూవీలర్‌పై తిరుగుతూ అనేక దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాగే సత్తుపల్లిలో ఇద్దరు వ్యక్తులు తమ బైకు పడిపోతోందని సాయం చేయాలని కోరి ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోయారు. దొంగలు పోలీసులకు చిక్కకుండా, నిఘా నేత్రాల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. గత 3 నెలలుగా అనేక దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలా దొంగిలించిన సెల్‌ఫోన్‌లను రేజర్లకు చెందిన ఓ వ్యక్తి సాయంతో హైదరాబాద్‌కు తరలించి, సెల్ఫోన్‌లో ఐఎంఈ నెంబర్లు మార్పు చేసి. మార్కెట్‌లో అమ్ముతున్నారనే ప్రచారం జరుగుతోంది.

పోలీసుల విఫలయత్నం..

స్థానిక పోలీసులు దొంగలను కట్టడి చేయడంలో వెనుకంజ వేస్తున్నారని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దొంగతనాలకు పాల్పడుతున్న ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు యాంగిల్ మార్పు చేసి, కనిపించకుండా లోనికి ప్రవేశించి, అక్కడి సీసీ ఇన్‌పుట్ డీవీఆర్ బాక్సులను సైతం వెంట తీసుకెళ్తూ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు సత్తుపల్లి పట్టణంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయకపోవడంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. సెల్‌ఫోన్లు, టూవీలర్లు టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed