మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. మొత్తం మూడు పార్టీల నేతల హస్తం?

by Prasad Jukanti |   (  Updated:2026-03-15 15:10:29  IST  )

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ పార్టీలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. మొత్తం మూడు పార్టీల నేతల హస్తం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తాజాగా సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ (టీడీపీ) పుట్టా మహేశ్ కుమార్ తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొనగా వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ ఆదివారం వెల్లడించారు. ఏలూరి ఎంపీకి తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‍లో నెగిటివ్ వచ్చిందని ఆ తర్వాత నిర్వహించిన బ్లడ్ టెస్టులో పాటిజివ్ వచ్చిందని తెలిపారు. సిమ్లా నుంచి కొకైన్ తీసుకువచ్చినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే:

అయితే ఈ పార్టీలో రాజస్థాన్‍కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మూడు పార్టీల నేతలు ఈ పార్టీలో ఇన్వాల్వ్ మెంట్ ఉందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు ఉండటంతో ఈకేసు నుంచి తమ వారిని తప్పించేందుకు ఆయా పార్టీల పెద్దలు అధికారులపై పొలిటికల్ ప్రెజర్ చేస్తున్నారని ఇందుకోసం ఏకంగా ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేయిస్తున్నట్లు ప్రత్యర్థులు ఆరోపించడంతో ఈ కేసు ఇప్పుడు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది.

రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్!

తాజా పరిణామం నేపథ్యలో మొయినాబాద్‍లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం పెద్ద ఎత్తున పార్టీలతో పాటు ఈ ఫామ్ హౌస్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డీల్స్ కూడా ఇదే ఫామ్ హౌస్‍లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్‍ను సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ పై సీపీ యాక్ట్ నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆర్డీవో సమక్షంలో ఈ ఫామ్ హౌస్ ను పోలీసులు సీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ డ్రగ్స్ ను ప్రోత్సహిస్తోంది: కాంగ్రెస్

డ్రగ్స్ ను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. రోహిత్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో లేదో చూడాలన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఎమ్మెల్యే.. మొయినాబాద్ ఫామ్ హౌస్ అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. అందుకే తాండూర్ ప్రజలు రోహిత్ రెడ్డిని తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదలమన్నారు.

హాట్ లైన్ రాజకీయాలు చేస్తు్నారు: వైసీపీ

ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేశ్ ను తప్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇందుకోసం ఆయన హాట్ లైన్ రాజకీయాలు చేస్తు్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ఉన్నారని ఇది సాదాసీదా విషయం కాదని తీవ్రమైన అంశం అన్నారు.

రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ అక్రమాలకు అడ్డా.. తాండూరు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Next Story