ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అనుమానితుడా? నిందితుడా?

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 10:32:29  IST  )

రాబోయే వారంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అనుమానితుడా? నిందితుడా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు వారాలుగా తెలంగాణ రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) చుట్టే తిరుగుతోంది. సంచలనంగా మారిన ఈ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్‍లో కీలక నేతలను విచారించిన దర్యాప్తు అధికారులు నిన్న గూలాబీ బాస్ కేసీఆర్‍ను దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసీఆర్ విచారణ పూర్తి కావడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ప్రశ్నించి నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా సిట్ త్వరోలనే ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్ కేసీఆర్ ను ఏమని పేర్కొనబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ అనుమనితుడా? లేక నిందితుడా ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

వారంలో కీలక పరిణామాలు!:

రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ నేతృత్వంలో రెండో సిట్ ఏర్పాటయ్యాక ఇటీవల దర్యాప్తు వేగం పెరింది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావుతో పాటు పలువురు అధికారులను నూతన సిట్ విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వీరి స్టేట్ మెంట్ల ఆధారంగా నిన్న కేసీఆర్ ను ప్రశ్నించిన సిట్ ఇక కేసును మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా కసరత్తు షురూచేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే వారం లోజుల్లో ఈ కేసులో సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నిన్నటి విచారణలో కేసీఆర్‍ను కీలక అంశాలపై ప్రశ్నలు సంధించిన సిట్ ఈ కేసులో సూత్రదారులు ఎవరు? పాత్రధారులు ఎవరు అనే విషయంలో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో అతి త్వరలోనే సిట్ (SIT) చార్జి షీట్‍లో దాఖలు చేయబోతోందనే ప్రచారం జరుగుతుండటంతో ఈ చార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.

అరెస్టులా? విచారణనా?

ఈ కేసులో కేసీఆర్ (KCR) విచారణ తర్వాత సిట్ ఏం చేయబోతోంది అనేదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంలో కింగ్ పిన్ గా ఉన్న కేసీఆర్ ను విచారించాక విచారించడానికి ఇంకెముంటుందనే వాదన కొంత మందిలో వినిపిస్తుంటే మరి కొందరు మాత్రం కేసీఆర్ కూతురు కవిత దంపతులను సిట్ ప్రశ్నించే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. సిట్ విచారణకు పిలిస్తే హాజరవుతానని తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. ఇక కేసీఆర్ విచారణ పూర్తి కావడంతో ఈ కేసులో ఇక అరెస్టులు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత నేరమైనది కావడంతో ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టులు జరగే అవకాశం లేకపోలేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జరిగితే ఎవరిని తొలుత అరెస్టు చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే అనేక సంచలనాలకు కేరాఫ్‍గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భవిష్యత్ లో ఏం జరగనుందో అనేది వేచి చూడాలి.

ఆ మాటలు కేసీఆర్‌కూ వర్తిస్తాయి.. రఘునందన్ రావు హాట్ కామెంట్స్

Next Story