అందె శ్రీ పాటలు తూటాలై.. గడిలను బద్దలు కొట్టాయి : రేవంత్ రెడ్డి

by Batti.Sumithra |

అందె శ్రీ పాటలు తూటాలై, మర ఫిరంగులై గడిలను బద్దలు కొట్టాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.

అందె శ్రీ పాటలు తూటాలై.. గడిలను బద్దలు కొట్టాయి : రేవంత్ రెడ్డి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అందె శ్రీ పాటలు తూటాలై, మర ఫిరంగులై గడిలను బద్దలు కొట్టాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అందె శ్రీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తెలంగాణ యువత మర ఫిరంగులు కావడానికి అందె శ్రీ పాటలే కారణమని స్పష్టం చేశారు. ప్రముఖ కవి అందె శ్రీ జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో 30 గుంటల స్థలంలో ఏర్పాటు చేయనున్న స్మృతి వనానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అందె శ్రీ పదాలపై పదాలు పేర్చి 'జయ జయహే తెలంగాణ' గీతం రచించారని గుర్తు చేశారు. ఆయన పాటలు లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చాయని తెలిపారు. "అందె శ్రీ నాకు పెద్దన్న.. ఆయనే నాకు స్ఫూర్తి" అని కొనియాడారు. తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందె శ్రీ గళమెత్తారని, నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందె శ్రీ తనకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందె శ్రీని నిర్లక్ష్యం చేసిందని, ఆయన పాటలను, పదాలను నిర్మూలించాలని చూశారని అన్నారు. అయినా దొరల గడీల ముందు నిలబడనని ధైర్యంగా చెప్పిన కవి అందె శ్రీ అని స్పష్టం చేశారు.

ఏనాడైతే అందె శ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో.. ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు అని తెలిపారు. అందె శ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ' గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడే భావించామని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి బడిలో, ప్రతి గడపలో ఆయన పాట వినిపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను తమ ప్రభుత్వం గౌరవిస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యులే లాభపడ్డారని, నిరుద్యోగులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చిందని ప్రతిపక్ష నేతలు నిస్సిగ్గుగా చెబుతున్నారని సీఎం మండిపడ్డారు.

మేకతోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేనే ప్రశ్నిస్తున్నా. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చారా, నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాల గురించి ఒక్కరోజైనా బీఆర్ఎస్ పాలకులు ఆలోచించారా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక గ్రూప్-1 నిర్వహించామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, వారి తల్లిదండ్రుల సాక్షిగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు చెప్పారు.

ఒక మిత్రుడి ఇంట్లో అందె శ్రీని కలిశానని, అందె శ్రీ తన ఆత్మబంధువుగా మారాడని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను దొర (ప్రగతి భవన్) గడీల వద్ద ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు.

నిజాంను మించిపోయారు..

కేసీఆర్ కుటుంబం నిజాంను మించి ధనవంతులుగా ఎలా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ 1,000 ఎకరాల్లో, కేటీఆర్ 100 ఎకరాల్లో, హరీశ్ రావు 50 ఎకరాల్లో, కవిత 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు అప్పుడే క్షమించారని అనుకుంటున్నారని, తాను ఉన్నంత వరకు మరోసారి వారి ప్రభుత్వం రానివ్వనని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను దోచుకోవాలని చూస్తే అందె శ్రీ మళ్లీ పాటై పుడతాడని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, శాసన మండలి ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కాలే యాదయ్య, నాగరాజు, శ్రీ గణేష్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story