- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది : మంత్రి దామోదర్
రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు గణనీయంగా మెరుగైందని, అందువల్లే ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు గణనీయంగా మెరుగైందని, అందువల్లే ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన సేవల కారణంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోందని ప్రైవేటు యాజమాన్యాలే చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటళ్లతో పాటు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రెండున్నరేళ్లలో 14 వేల పోస్టుల భర్తీ..
ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ల ద్వారా ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు డాక్టర్లు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది సహా సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేశామని, అవసరమైన చోట నియామకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని గుర్తు చేశారు. పాత, ఇరుకు భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని, మందులు, సర్జికల్స్ కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని వనరులను కల్పిస్తున్నందున, సేవల నాణ్యతలో లోపాలు ఉంటే ఎలాంటి సాకులు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సూపరింటెండెంట్ తన హాస్పిటల్‌ను ఓన్ చేసుకోవాలని... రోగి అడుగుపెట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇబ్బందులు లేకుండా చూసే వ్యవస్థను రూపొందించాలన్నారు. ప్రతిరోజు సూపరింటెండెంట్లు స్వయంగా వార్డులను సందర్శించి, రోగులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. హాస్పిటళ్లలో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, భోజన నాణ్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ సమయపాలన పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం, అనవసర గైర్హాజరు, రోగులను గంటల తరబడి వేచి ఉంచడాన్ని సహించేది లేదన్నారు. అత్యవసర విభాగాలు, ఐసీయూలు, ప్రసూతి వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, రేడియాలజీ సేవలు 24 గంటలూ సమర్థవంతంగా పనిచేయాలని.... అత్యవసర రోగులకు ఆలస్యం లేకుండా చికిత్స అందించాలన్నారు.
నిరంతర నిఘాకు డ్యాష్ బోర్డు..
హాస్పిటళ్ల పనితీరును ఇకపై నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, మాతా-శిశు సంరక్షణ, రోగుల సంతృప్తి వంటి సూచీల ఆధారంగా హాస్పిటళ్ల ప్రగతిని అంచనా వేస్తామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మందుల కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటే వెంటనే కలెక్టర్లు, హెచ్‌వోడీలు లేదా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్‌పర్సన్ డా. కవిత పాల్గొన్నారు.






